‘ఇంజినీరింగ్‌’ కనీస ఫీజు రూ.42,500

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల ఖరారుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతానికి కనీస ఫీజు రూ.42,500గా నిర్ణయించాలని మధ్యేమార్గంగా ప్రతిపాదన చేసింది.

Updated : 02 Aug 2023 06:40 IST

హైకోర్టు ప్రతిపాదన
యాజమాన్యాలు వైఖరి తెలిపేందుకు విచారణ నేటికి వాయిదా

ఈనాడు, అమరావతి: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల ఖరారుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతానికి కనీస ఫీజు రూ.42,500గా నిర్ణయించాలని మధ్యేమార్గంగా ప్రతిపాదన చేసింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులు నిర్ధారించిన కళాశాలల్లో మరో 10శాతం రుసుములు పెంచుకోవడానికి వీలు కల్పిస్తామని సూచన చేసింది. ఈ ప్రతిపాదనపై వైఖరి తెలపాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈమేరకు ప్రతిపాదన చేశారు. ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ గతేడాది దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించే రుసుములతో కళాశాలలు నడిపే పరిస్థితి లేదన్నారు. 2019-20లో కనీస రుసుము రూ.35 వేలుగా నిర్ణయించారని, అప్పటి నుంచి అదే కొనసాగుతోందని వివరించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, జీపీ రఘువీర్‌ వాదనలు వినిపించారు. కళాశాలలోని మౌలిక వసతులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రుసుములు నిర్ణయించామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజును ఇంకా నోటిఫై చేయలేదన్నారు. పూర్తి సమాచారం సమర్పించాలని కళాశాల యాజమాన్యాలను ఇప్పటికే కోరామని పేర్కొన్నారు. మరికొన్ని కళాశాలల నుంచి రావాల్సి ఉందన్నారు. ప్రస్తుత రుసుముకు మరో 10శాతం వసూలు చేసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతి ఇస్తామన్నారు. త్వరలో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కోర్టుకు తెలిపారు. ఆ ప్రక్రియ కొనసాగేందుకు అనుమతించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని