వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ ప్రథమం

ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది.

Updated : 22 Aug 2023 06:02 IST

పెరిగిన వరి, నూనెగింజల సాగు
తగ్గిన పప్పుదినుసులు, చిరుధాన్యాలు, చెరకు, పత్తి సాగు

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. కేంద్ర వ్యవసాయశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నెల 18వ తేదీ వరకు సేకరించిన గణాంకాలను తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో వరి, నూనెగింజల సాగు రెండేళ్ల కంటే పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి 4.42 లక్షల హెక్టార్లు, నూనెగింజలు 0.23 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా.. అందులో 30% వాటా తెలంగాణదే. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పప్పుదినుసుల సాగు 0.37, చిరుధాన్యాలు 0.01, చెరకు 0.08, పత్తి 1.46 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. పప్పుదినుసుల సాగు అయిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. కంది, మినుము, పెసల సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. చిరుధాన్యాల సాగు గత రెండేళ్ల కంటే తగ్గిపోయింది. చెరకు సాగు గత ఏడాది కంటే, పత్తి గత మూడేళ్ల కంటే తగ్గింది. మొక్కజొన్న పరిస్థితి గత ఏడాది కంటే మెరుగ్గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు