ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?

తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Published : 19 Mar 2024 06:53 IST

మోదీ స్టేజీ నుంచి పూర్తిగా వెళ్లకుండానే వేదికపైకి వచ్చిన జనం
తోపులాటలు జరుగుతున్నా ఎస్పీలు సరిగా స్పందించలేదన్న విమర్శలు
అడుగడుగునా ప్రస్ఫుటంగా కనపడిన పోలీసు వైఫల్యం

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని హాజరైన సభలో కీలకమైన డి-గ్యాలరీ సమీపంలో తోపులాటలు చోటుచేసుకోవడం, వాటర్‌ బాటిళ్లు విసురుకోవటం వంటివి చేస్తున్నా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉండే గ్యాలరీల్లోకి వీవీఐపీ, వీఐపీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలి. పోలీసు ఉన్నతాధికారులు పాసుల్లేని వారిని కూడా అనుమతించేయడంతో గ్యాలరీల్లోకి లెక్కకు మించి జనాలు చేరడం కూడా తోపులాటకు కారణమైంది. ఈ గ్యాలరీల వద్ద గుంటూరు రేంజ్‌లో పని చేసే ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్‌ పరిధిలోని మరో ఎస్పీని విధి నిర్వహణకు కేటాయించారు. అయితే వారెవరూ తోపులాటల సమయంలో అక్కడ అందుబాటులో లేరు. ఒకవైపు రభస చోటుచేసుకుని మైకుల స్టాండ్ల పైకి ప్రమాదకరంగా ఎక్కుతున్న వ్యక్తుల్ని గుర్తించి వారి ప్రాణాల్ని కాపాడాలని ప్రధానమంత్రే విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రోప్‌ వేసి అడ్డుకోవడం లేదా మైకుల స్టాండు చుట్టూ రక్షణగా నిలబడటం వంటి చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో కూర్చొన్నారని సహచర పోలీసులే అంటున్నారు. మరో ఎస్పీకి ఇక్కడ చోటుచేసుకుంటున్న తోపులాటల్ని తెలియజేద్దామని ఫోన్‌ చేస్తే ఆయన ఫోన్‌ అందుబాటులోకి రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు సరైన ఆదేశాలు లేకుండా ఏం చేయగలమని కొందరు పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, డీఎస్పీలు వంటివారు దూరంగా ఉండటంతో గ్యాలరీల్లో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది.  

ప్రణాళిక అమలు ఏదీ?

పీఎంవో అధికారులు దిల్లీ నుంచి తీసుకొచ్చిన హైఎండ్‌ మైకులు, ఇతర భద్రత పరికరాలను తిరిగి తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రధాన వేదిక వద్ద పోలీసు బందోబస్తు లేకుండా పోయింది. ఆ సమయంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు వేదిక మీదకు చేరుకుని సెల్ఫీలు దిగుతూ వారికి అంతరాయం కలిగించారు. ప్రధానమంత్రి పర్యటన, సభా ప్రాంగణం వద్ద భద్రతా విధులు పర్యవేక్షించే ఉన్నతాధికారి.. వేదిక, వీఐపీల గ్యాలరీల భద్రత పర్యవేక్షణను ముగ్గురు ఎస్పీలకు అప్పగించారు. మైకులకు సంబంధించిన డీ గ్యాలరీ ఓ ఎస్పీ పర్యవేక్షణలో ఉంది. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఎలా ఉండాలి, వచ్చిపోయే వారి కోసం ఎన్ని మార్గాలు ఉండాలి? ఎవరిని ఏ వైపు నుంచి అనుమతించాలి వంటివి ముందుగానే కూటమి నేతలతో చర్చించి వారికి సూచనలు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించారు.

కొరవడిన పోలీసుల సహకారం 

ప్రధాని రాకకు ముందే కార్యకర్తలు, ప్రజలు సభా ప్రాంగణంలోకి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులే పార్టీ నేతలకు సూచించాలి. ఆయన వేదిక మీదకు వచ్చిన తర్వాత రాకపోకలు సాగకూడదని ముందుగానే పార్టీ నాయకులకు చెప్పి ఉంటే ఆలోపే శ్రేణులకు దిశానిర్దేశం చేసుకుని ఉండేవాళ్లమని, కానీ పోలీసుల నుంచి తమకు పూర్తి సహాయ నిరాకరణ ఎదురైందని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. పెద్దసంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశామని, రాష్ట్రం నలుమూలల నుంచి అధికారుల్ని పిలిపించామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. వారిలో అప్పగించిన విధుల్ని ఎంతమంది పక్కాగా నిర్వహించారనేది గుర్తించాలని సూచించారు. కొందరు పోలీసులు హోటల్‌ గదులు దాటి బయటకు రాలేదని ఆరోపించారు. ఏకంగా ప్రధాని సభలోనే తోపులాటలు, రభస జరిగి సభ నిర్వహణకు అంతరాయం కలిగినా.. ఇలా ఎందుకు జరిగింది, కారణాలేంటనే సమీక్ష కూడా చేసుకోలేదంటే పోలీసు ఉన్నతాధికారులకు ఉన్న ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని