Pinnelli: పిన్నెల్లి పరార్‌!

తనను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడంలో, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... వ్యవస్థలను తప్పుదోవపట్టించడంలోనూ ఆరితేరారు.

Updated : 23 May 2024 09:27 IST

హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు
ఏపీ పోలీసుల అదుపులో గన్‌మ్యాన్, డ్రైవర్‌
సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే
పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం 
ఈనాడు - హైదరాబాద్‌

తనను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడంలో, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... వ్యవస్థలను తప్పుదోవపట్టించడంలోనూ ఆరితేరారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌ పొసగని సమాధానాలు ఇవ్వడం... అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు. 

అదేరోజు హైదరాబాద్‌కు పలాయనం! 

పోలింగ్‌ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి... పోలీసు కేసు అవుతుందని గ్రహించి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రామకృష్ణారెడ్డి కేపీహెచ్‌బీలోని ఇందూ విల్లాస్‌లో ఉన్న తన నివాసంలో, ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారు. ఈవీఎం ధ్వంసంపై పోలింగ్‌ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది. రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఫోన్‌ ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఇందూ విల్లాస్‌కు చేరుకుంది. 

తెలంగాణలోని సంగారెడ్డి సీసీఎస్‌ వద్ద ఏపీ పోలీసులు

జాతీయ రహదారిపై వెంటాడిన పోలీసులు

పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్‌ నుంచి 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళుతుండంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈక్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెళితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించి, కారు పటాన్‌చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్దిదూరం వెళ్లి గణేష్‌తండా వద్ద ఆగిపోయింది. దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్, గన్‌మ్యాన్‌ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్‌ ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిద్దర్నీ విచారించడంతో కారు ఆగగానే ఫోన్‌ తమకిచ్చిన పిన్నెల్లి... డివైడర్‌ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని, అందులో ఎక్కి హైదరాబాద్‌ వైపు వెళ్లిపోయారని వివరించారు. దాంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్‌కు తరలించారు. దాదాపు అర గంటపాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు. 

ఆ కారులో పిన్నెల్లి లేనట్లేనా...?

పోలీసులు వెంటాడుతున్నప్పటికీ ముందున్న కారులో నుంచి దిగి, రోడ్డు దాటి, మరోవైపునకు వెళ్లి, అక్కడ నుంచి పారిపోవడం ఎంతవరకు సాధ్యమన్నది అంతు పట్టుడంలేదు. దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము వెంటాడిన కారులో పిన్నెల్లి లేరనే భావిస్తున్నారు. పిన్నెల్లి ఫోన్‌ ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు. జాతీయ రహదారిపై ఆయన కారును అనుసరించారు. చివరకు కారును, అందులో డ్రైవర్, గన్‌మ్యాన్‌లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్‌ నుంచి పరారయ్యారని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్‌ను ఇంట్లో వదిలేసి వెళ్లారని, పోలీసుల రాకను గమనించి ఆయన డ్రైవర్, గన్‌మ్యాన్‌లను తన కారులో వెళ్లిపోవాలని ముందుగానే సూచించి ఉంటారని, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది. అంతేతప్ప ఆ కారులో అసలు పిన్నెల్లి లేనేలేరని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్‌ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.


మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై లుక్‌ అవుట్‌ నోటీసులు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, రిప్రజంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్, ప్రివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ చట్టాల పరిధిలో పది సెక్షన్ల కింద ఈ నెల 20న కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ పోలీసులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లో పిన్నెల్లి ఉన్నారన్న సమాచారంతో గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు సారథ్యంలో నాలుగు పోలీసు బృందాలు బయలుదేరి బుధవారం ఉదయం అక్కడకు చేరుకున్నాయి. ఆయా బృందాల నుంచి ఎస్పీ సమాచారాన్ని తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని