Apple: యాపిల్‌లో 600 ఉద్యోగాల కోత.. స్మార్ట్‌కారు, డిస్‌ప్లే ప్రాజెక్టుల రద్దు ఎఫెక్ట్‌

Apple: స్మార్ట్‌ కారు, కొత్తతరం డిస్‌ప్లే ప్రాజెక్టులకు యాపిల్‌ ఇటీవల స్వస్తి పలికింది. దీంతో కొంత మంది ఉద్యోగులను తొలగించింది.

Published : 05 Apr 2024 09:51 IST

కాలిఫోర్నియా: స్మార్ట్‌ కారు, స్మార్ట్‌వాచ్‌ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్కన పెట్టిన ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్‌ డెవలప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌’కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. సిబ్బందిలో మార్పులు చేర్పులను ఈ డిపార్టుమెంట్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా వెల్లడించిన సమాచారంలో కొత్తతరం స్క్రీన్‌ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తున్న 87 మందిని.. కారు ప్రాజెక్టు నుంచి మిగతావారిని తీసేసినట్లు తెలుస్తోంది.

కొత్తతరం టెక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడంలో భాగంగా స్మార్ట్‌ కారు, డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్‌ (Apple) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. కానీ, భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల వాటిని పక్కన పెట్టింది. డిస్‌ప్లే ప్రాజెక్టు విషయంలో ఇంజినీరింగ్‌, సరఫరా వంటి సమస్యలూ తలెత్తినట్లు తెలిసింది. స్మార్ట్‌కారుపై పనిచేస్తున్న వారిలో కొంతమందిని కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని