క్రిప్టో క‌రెన్సీకి భార‌త్‌లో చట్టబద్ధత ఉందా?

ప్ర‌స్తుతం చాలా ర‌కాల క్రిప్టోక‌రెన్సీలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ బిట్‌కాయ‌న్‌కి క్రేజ్ ఎక్కువ‌

Updated : 30 Jul 2022 17:18 IST

క్రిప్టో క‌రెన్సీ భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్నెళ్లుగా ఇందులో పెట్టుబ‌డులు పెట్టే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుంది. ఇది కేవ‌లం పెద్ద‌ పెద్ద మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు. చిన్న చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో సైతం పెట్టుబ‌డిదారులు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌లె బ్రోక‌ర్ చూస్ అనే సంస్థ అందించిన నివేదిక‌ల ప్ర‌కారం మ‌న దేశంలో 10.07 కోట్ల మంది వ‌ద్ద‌ క్రిప్టోక‌రెన్సీ ఉంది.

అస‌లు ఏంటి క్రిప్టో క‌రెన్సీ..
ఇది కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ క‌రెన్సీ.  దీనికి ఒక భౌతిక  రూపం ఉండ‌దు. డిజిట‌ల్ రూపంలో దాచుకోవ‌చ్చు. ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు. అంత‌ర్జాతీయ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ. దీన్నే ప్రైవేట్ క‌రెన్సీ అని కూడా అంటారు. ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఎక్క‌డి నుంచైనా దీన్ని ఆప‌రేట్ చేయ‌చ్చు.  ఒరిజిన‌ల్ క‌రెన్సీకి ఎక్స్‌ఛేంజ్‌గా వాడ‌తారు. ఏ  దేశానికి సొంతం కాదు. ఏ ప్ర‌భుత్వ ఆధీనంలో ఉండ‌దు. ఏ బ్యాంకుకి దీంతో సంబంధం లేదు.  కాబ‌ట్టి లావాదేవీల‌పై ఛార్జీలు ఉండ‌వు. ఎంత మొత్తంలోనైనా లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఎలా ప‌నిచేస్తుంది?
ఇది వ‌ర్చువ‌ల్‌ డీసెంట్ర‌లైజ్డ్ క‌రెన్సీ. ఇది కంప్యూట‌ర్‌లో దాచుకునే ఒక ఫైల్ లాంటిది. కంప్యూట‌ర్లు, స్మార్ట్  ఫోన్‌ల‌లో డిజిట‌ల్ వ్యాలెట్ మాదిరిగా దాచుకోవ‌చ్చు. ఇది పేపాల్ వంటి డిజిటల్ ఖాతాల మాదిరిగానే ప‌నిచేస్తుంది. క్రిప్టోక‌రెన్సీ అధికారికం చేసిన దేశాల‌లో ఈ క‌రెన్సీని ఉప‌యోగించి వ‌స్తుసేవ‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. భార‌త్‌లో వ‌స్తుసేవ‌ల కొనుగోలుకు ఉప‌యోగించ‌లేము. రూపాయిల‌ను క్రిప్టో క‌రెన్సీ వ్యాలెట్‌కి లోడ్ చేసి ట్రేడ్ చేసే అవ‌కాశం ఉంది. అలాగే ఎవ‌రైనా అనుమ‌తిస్తే, వారి వ్యాలెట్‌కి పంప‌చ్చు. లావాదేవీని పూర్తి చేయడానికి, మీకు ప్రైవేట్ కీ(పాస్‌వర్డ్‌) అవ‌స‌రం.

భ‌ద్ర‌త ఉంటుందా?
క్రిప్టో క‌రెన్సీ లావాదేవీలు ప్ర‌తీది రికార్డ్ అవుతాయి. బ్లాక్‌చైన్ టెక్నాల‌జి ద్వారా ప‌బ్లిక్ లెడ్జెర్‌లో లావాదేవీల‌ను రికార్డ్ చేస్తారు. వీటిని హేక్ చేయ‌డం కుద‌రదు. ఎందుకంటే ఇవి క్రిప్టోగ్ర‌ఫీ అనే సిస్ట‌మ్‌తో సెక్యూర్ చేస్తారు. ప్ర‌స్తుతం చాలా ర‌కాల క్రిప్టోక‌రెన్సీలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ బిట్‌కాయ‌న్‌కి క్రేజ్ ఎక్కువ‌. దీంతో పాటు ఇథీరియ‌మ్‌, బిట్‌కాయిన్ క్యాష్‌, రిపిల్‌, లైట్ కాయిన్‌, ఎన్ ఈ ఎమ్‌, డాష్ వంటి క్రిప్టో క‌రెన్సీలు అందుబాటులో ఉన్నాయి.    

చ‌ట్ట‌బ‌ద్ద‌త ఉంటుందా?
ఇంట‌ర్నెట్‌నే తీసుకోండి. ప్ర‌పంచవ్యాప్త‌గా కోట్లాది మంది ప్ర‌జ‌లు దీన్ని వాడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ దేశం ఇంట‌ర్నెట్‌ను నియంత్రించ‌దు. క్రిప్టో క‌రెన్సీ కూడా కొంత వ‌ర‌కు ఇంట‌ర్నెట్ లాంటిదే. ఏదేశం నియంత్ర‌ణ‌లోనూ ఉండ‌దు. ఏ బ్యాంకు జారీ చేయ‌దు కాబ‌ట్టి చ‌ట్ట‌బ‌ద్ద‌త ఉండ‌దు. అలాగ‌ని న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌మూ త‌క్కువే. ప‌న్ను చెల్లింపుల వంటి వాటికి ఛార్టెంట్ అక్కౌంట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు క్రిప్టో క‌రెన్సీని అధికారికం చేయ‌గా.. మ‌రికొన్ని దేశాలు నిషేదించాయి.

భార‌త్‌లో క్రిప్టో క‌రెన్సీ చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా?
రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో భార‌త్‌లో క్రిప్టో క‌రెన్సీని నిషేధించింది. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణ‌యాన్ని 2020లో తోసిపుచ్చింది. ఈ తీర్పు దేశంలో క్రిప్టో క‌రెన్సీల వ్యాపారాన్ని సుల‌భత‌రం చేసింది. అంతేకాకుండా  దేశంలో క్రిప్టో క‌రెన్సీని ఆమోదించేందుకు కేంద్రం క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లును సిద్ధంచేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో వీటి వినియోగం పెరిగింది. ఎంత‌లా అంటే క్రిప్టో క‌రెన్సీని కొనుగోలు చేయ‌డంలో భార‌త్ ప్ర‌పంచంలోనే అగ్ర స్థానంలో నిల‌బ‌డేంత. 

పెట్టుబ‌డుల‌కు రిస్క్ ఉంటుందా?
మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాక్స్ మాదిరిగానే.. క్రిప్టో క‌రెన్సీ పెట్టుబ‌డులో కూడా రిస్క్ ఉంటుంది. అయితే షేర్ ట్రేడింగ్‌, మ్యూచువ‌ల్ ఫండ్లకు ప్ర‌భుత్వం నియ‌మించిన సెక్యురీటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఇండియా(సెబి) నియంత్ర‌ణ ఉంటుంది. కానీ క్రిప్టో క‌రెన్సీ ఏ నియంత్ర‌ణ సంస్థ ప‌రిధిలోకి రాదు కాబ‌ట్టి అధిక రిస్క్ ఉంటుంది. ఇది డిమాండ్ అండ్ స‌ప్ల‌య్ సూత్రం ఆధారంగా ప‌నిచేస్తుంది.  గిరాకి పెరిగితే క‌రెన్సీ విలువ అమాంతం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అంతే త్వ‌ర‌గా ప‌డిపోయే అవ‌కాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబ‌డి కూడా తిరిగి రాక‌పోవ‌చ్చు. క్రిప్టో క‌రెన్సీకి వాడ‌కం పెర‌గ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో అనేక ర‌కాల స్కాములు వెలుగు చూసే అవ‌కాశం ఉంది.  అలాగే క్రిప్టో క‌రెన్సీ ఒడిదుడుకులు చాలా ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి నైపుణ్యం వుంటెనే పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు