Stock Market: నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి

Stock Market: స్టాక్‌ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

Updated : 29 May 2024 07:57 IST

అప్పుడే మెరుగైన ప్రతిఫలం
స్వల్పకాల పెట్టుబడుల ఆలోచన వద్దు
ఆర్థిక వ్యవస్థలో పటిష్ఠ మూలాల వల్లే మార్కెట్‌ ర్యాలీ
విశ్లేషకులు

దిల్లీ: స్టాక్‌ మార్కెట్లో (Stock Market) లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. స్వల్పకాల పెట్టుబడుల ఆలోచన మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ మూలాలు, కార్పొరేట్‌ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలే ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్ల దూకుడుకు కారణమని వివరిస్తున్నారు. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్‌లు చాలా మెరుగయ్యాయని,  దీని వల్ల చాలా కంపెనీల సామర్థ్య విస్తరణకు అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది కూడా మార్కెట్లలో సానుకూలతను తీసుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. వివిధ సంస్థల నిపుణులు ఏమంటున్నారంటే..

స్పెక్యులేషన్‌ వద్దు

‘విభిన్న రంగాల షేర్లలో పెట్టుబడులు, బలమైన మూలాలతో కూడిన నాణ్యమైన షేర్ల ఎంపిక, స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం లాంటివి పాటిస్తే నష్టముప్పును తగ్గించుకోవచ్చ’ని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ద ఇన్‌ఫినిటీ గ్రూపు వ్యవస్థాపకుడు, డైరెక్టరు వినాయక్‌ మెహతా సూచించారు. స్వల్పకాలిక పెట్టుబడుల ఆలోచనను దూరం పెట్టి.. కనీసం రెండు, మూడేళ్ల వరకు వేచిఉండేలా దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌ తేదీ అయిన జూన్‌ 1 వరకు మార్కెట్లకు ఒడుదొడుకులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మీ లక్ష్యంపై స్పష్టత కావాలి

ఆర్థిక లక్ష్యాలు, మూలధన లభ్యత, నష్టాన్ని భరించే స్థోమత ఆధారంగా మదుపర్లు పెట్టుబడులు పెట్టాలని ఫైయర్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తేజాస్‌ ఖోడే సూచించారు. అదృష్టంపై ఆధారపడకుండా దీర్ఘకాల పెట్టుబడుల వూహాన్ని అనుసరించాలని తెలిపారు. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌)ల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించాలని సలహా ఇచ్చారు. 

విలువలు ఇంకా పెరుగుతాయ్‌

‘ప్రస్తుతం ఈక్విటీల్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉంది. ఇది పెరగాలంటే చాలానే సమయం పట్టొచ్చు. అయితే స్టాక్‌ మార్కెట్లు మరింతగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాన’ని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్త ఉపాసనా భరద్వాజ్‌ తెలిపారు. 

భారత ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం సమంజస స్థాయిలోనే ఉన్నాయి. మధ్య, దీర్ఘకాలంలో ఈ విలువలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆనంద్‌ రాఠీ గ్రూపు వైస్‌ ఛైర్మన్‌ ప్రదీప్‌ గుప్తా అంచనా వేస్తున్నారు. 


డిసెంబరు కల్లా 24,500కు నిఫ్టీ

ఈ ఏడాది డిసెంబరు కల్లా నిఫ్టీ 50 సూచీ 24,500 పాయింట్లను చేరే అవకాశం ఉందని ఎమ్‌కీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాల్లో 15% వృద్ధి ఉండొచ్చని భావించి, ఈ అంచనాను వెల్లడించింది. 2025 డిసెంబరు నాటికి నిఫ్టీ 26,500 పాయింట్లను అధిగమిస్తుందన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటం, విధానపరమైన సంస్కరణలు కొనసాగనుండటం లాంటివి సానుకూలాంశాలుగా పేర్కొంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, బ్రిటన్, అమెరికాలలో ఎన్నికలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు రానున్న కాలంలో మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషించింది. 


ఎఫ్‌ఐఐలు వెనక్కి తీసుకున్నా.. 

విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకున్నప్పటికీ.. సూచీలు రాణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) రూ.20,700 కోట్ల వరకు పెట్టుబడులను దేశీయ ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. సెన్సెక్స్‌ సోమవారం తొలిసారి 76000 పాయింట్లను తాకగా.. నిఫ్టీ 23,110.80 పాయింట్ల వద్ద జీవనకాల కొత్త గరిష్ఠాన్ని నమోదుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని