అప్పుడు సెల్‌ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో

సెల్‌ఫోన్లకు అవసరమైన చిప్‌సెట్‌లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి.

Updated : 10 Apr 2024 06:42 IST

చిప్‌సెట్‌ సంస్థలు క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ పోటాపోటీ

సెల్‌ఫోన్లకు అవసరమైన చిప్‌సెట్‌లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. సంప్రదాయ వాహనాల్లోనూ చిప్‌సెట్ల వినియోగం పెరగ్గా, విద్యుత్తు వాహనాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌ ఇప్పటికే భారత కంపెనీలతో పనిచేస్తోండగా.. తైవాన్‌కు చెందిన మీడియా టెక్‌ కూడా విద్యుత్‌ వాహన (ఈవీ) సంస్థలతో త్వరలోనే ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

కాలిఫోర్నియాకు చెందిన క్వాల్‌కామ్‌ మనదేశ వాహన దిగ్గజాలైన టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీవీఎస్‌ వంటి కంపెనీలతో భాగస్వామ్యాలను ఇటీవలే ప్రకటించింది. ‘ఆయా కంపెనీల వాహనాలకు క్వాల్‌కామ్‌ ప్లాట్‌ఫారాలను అందిస్తున్నాం. భారత ఓఈఎమ్‌ (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌)లతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం. వారికి కావలసిన స్మార్ట్‌, కనెక్టెడ్‌, సెక్యూర్‌ టెక్నాలజీలను మా మొబైల్‌ నైపుణ్యంతో అందిస్తున్నా’మని క్వాల్‌కామ్‌ ఇదివరకే తెలిపింది.

రంగం సిద్ధం చేసుకున్న మీడియాటెక్‌: కొత్తగా వాహన పరిశ్రమలోకి అడుగుపెడుతున్న మీడియాటెక్‌, ఈ విభాగం భవిష్యత్‌లో దేశ ఆదాయాలకు ప్రధాన వనరుగా మారగలదని భావిస్తోంది. త్వరలోనే మనదేశంలో ఒక ద్విచక్ర ఈవీ కంపెనీతో తొలి భాగస్వామ్యాన్ని ప్రకటించగలమని చెబుతోంది. నాలుగు చక్రాల వాహన కంపెనీలతోనూ తుది దశ చర్చల్లో ఉన్నట్లు తెలిపింది. ‘వచ్చే రెండేళ్లలో అత్యంత వేగంగా ఈవీ విపణి వృద్ధి చెందుతుంది. భారత్‌లోని ఈవీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం. మాకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఈ విభాగం నిలవగలదన్న విశ్వాసం మాకుంద’ని మీడియాటెక్‌ అంటోంది. కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం ‘డైమెన్సిటీ ఆటో’ను ఆవిష్కరించడం ద్వారా ఈ మార్కెట్లోకి వస్తున్నట్లు మీడియాటెక్‌ గతేడాది సంకేతాలు పంపింది. ప్రధాన వాహన కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ విడిభాగాలైన కనెక్టివిటీ, డిజిటల్‌ కాక్‌పిట్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, టెలీమాటిక్స్‌ యూనిట్స్‌ తదితరాలన్నిటికీ వన్‌-స్టాప్‌ సొల్యూషన్‌గా మారాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది.


ఎందుకీ ఉత్సాహం..

ఈ కంపెనీలు ఈవీ రంగంపై ఉత్సాహం చూపడానికి కారణాలు లేకపోలేదు. 2030 కల్లా ప్రయాణికుల వాహనాల్లో 80 శాతానికి పైగా, ఈవీల్లో 70 శాతానికి పైగా ఎంబెడెడ్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయని  అంచనా. ఎంబెడెడ్‌ కనెక్టివిటీ అంటే బిల్ట్‌ ఇన్‌ చిప్‌సెట్‌, యాంటెన్నాతో కార్లలో ఇంటర్నెట్‌ ఉండడం. వీటివల్ల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ల డౌన్‌లోడ్‌లు కానీ.. ఇతర పరికరాలు, నెట్‌వర్క్‌లతో అనుసంధానం కానీ సులువుగా చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఓఈఎమ్‌లకు దీటుగా మనదేశ సంస్థలు కూడా అధునాతన ఫీచర్లను మధ్య స్థాయి, ప్రారంభ స్థాయి కార్లలో అమర్చుతున్నాయి. అంటే ఈ చిప్‌సెట్‌ దిగ్గజాలకు అపార అవకాశాలు ఉన్నట్లే. అందుకే క్వాల్‌కామ్‌, మీడియాటెక్‌ సంస్థలు తమ స్థానిక పరిశోధన-అభివృద్ధి యూనిట్ల సహాయంతో ఇక్కడి అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలని భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత వాహన రంగ భవిష్యత్‌ అత్యంత మెరుగ్గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని