క్షణాల్లో బీమా.. ఐఆర్‌డీఏఐ కల్పించిన ధీమా

దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ).

Updated : 21 Apr 2024 09:16 IST

25వ వసంతంలోకి ప్రతిష్ఠాత్మక సంస్థ
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ). ఈ సంస్థ శుక్రవారానికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని, 25వ ఏటకు అడుగు పెట్టింది.

ఆవిర్భావం ఇలా

బీమా రంగాన్ని సరళీకృతం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఐఆర్‌డీఏఐ. ఈ సంస్థ విధి విధానాలపై 1993లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ మల్హోత్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, 1994లో నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఆరేళ్లకు 2000 ఏప్రిల్‌ 19న ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. బీమా రంగంలో ఆర్థిక భద్రతను కల్పించడం, పాలసీదారులకు సరైన సేవలను అందించడం ముఖ్యంగా, బీమా రంగంలో పోటీని ప్రోత్సహించడం ద్వారా, మరింత మందికి బీమా కల్పించడమే ఐఆర్‌డీఏఐ ప్రధాన లక్ష్యం.

బీమా చట్టం 1938లోని సెక్షన్‌ 114ఏ కింద నిబంధనలు రూపొందించే అధికారాలను ఈ సంస్థ పొందింది. బీమా సంస్థల నమోదు నుంచి, పాలసీల అనుమతులు, సలహాదారులు, పరిహారం విషయంలో పాలసీదారులకు రక్షణ ఇలా ఎన్నో నిబంధనలను కాలానుగుణంగా ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది. బీమా చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చింది. కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటికి ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీమా రంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

కీలక సంస్కరణలతో..

గత 24 ఏళ్లలో బీమా రంగంలో ఐఆర్‌డీఏఐ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానంగా 2000 సంవత్సరంలో విదేశీ బీమా కంపెనీలు దేశంలో అడుగు పెట్టేందుకు వీలు కల్పించింది. 26% వాటాతో అనేక విదేశీ బీమా సంస్థలు ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వ బీమా సంస్థలతో పాటు అనేక కొత్త ప్రైవేటు బీమా సంస్థలూ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జీవిత బీమా సంస్థలు 26, సాధారణ బీమా సంస్థలు 27, ఆరోగ్య బీమా సంస్థలు 5 ఉన్నాయి. బీమా రంగంలో ఉద్యోగుల సంఖ్య 6 రెట్ల వరకూ పెరిగింది. నిర్వహణలో ఉన్న ఆస్తులు ఏడు రెట్లు పెరిగాయి. కార్పొరేట్‌ ఏజెంట్లు, బ్యాంకసూరెన్స్‌ వంటి కొత్త సలహాదారులు మార్కెట్లోకి వచ్చారు. బీమా పాలసీలను క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో తీసుకునే వీలు కూడా ఐఆర్‌డీఏఐ చేపట్టిన చర్యల ఫలితమే. కొవిడ్‌ కష్ట కాలంలో సత్వరం ప్రత్యేక కరోనా పాలసీలను తీసుకురావడంతో పాటు, పాలసీదారులకు క్లెయిం చెల్లించాలని బీమా సంస్థలను ఆదేశించడం లాంటివి ఐఆర్‌డీఏఐ ప్రతిష్ఠను పెంచాయనడంలో సందేహం లేదు.

మార్గదర్శకంగా..

ఐఆర్‌డీఏఐ తీసుకున్న చర్యల వల్ల బీమా రంగంలో ఎన్నో అంకుర సంస్థలు ఉద్భవించాయి. బీమా కంపెనీలకు పాలసీలను రూపొందించడంలో సహాయం చేయడం, పాలసీల పంపిణీ, క్లెయిం ప్రాసెసింగ్‌.. మొదలైన సేవలను అందించేందుకు అనుబంధ సంస్థలూ వచ్చాయి. బీమా వ్యాప్తి ఇప్పుడు 4.3 శాతంగాపై ఉంది. బీమా రంగాన్ని నిబంధనలు, పర్యవేక్షణలతో నియంత్రించడం కాకుండా.. మార్గదర్శకంగా ఉంటూ.. ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఐఆర్‌డీఏఐ కీలక పాత్ర పోషిస్తోందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.

2047 కల్లా అందరికీ బీమా లక్ష్యంగా

స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంగా ఐఆర్‌డీఏఐ లక్ష్యంగా విధించుకుంది. ఇందుకు అనుగుణంగా బీమా సంస్థలను సన్నద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బీమా అందించేలా డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. నియంత్రణ సంస్థ ప్రస్తుత ఛైర్మన్‌ దేబాశిష్‌ పాండా ఈ విషయంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. ఇ-కేవైసీ, డిజిటల్‌ పాలసీలు, డిజిటల్‌ చెల్లింపులు, ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో కీలక మార్పులు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు. సంప్రదాయ పద్ధతుల నుంచి బీమా రంగం ఆధునిక, సాంకేతిక ఆధారిత పద్దతులకు మారడం ద్వారా ప్రపంచంలోనే భారతీయ బీమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది.

హైదరాబాద్‌ కేంద్రంగా...

ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ముంబయి ఉండే రోజుల్లో.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ప్రత్యేక చొరవ వల్ల హైదరాబాద్‌ కేంద్రంగా ఐఆర్‌డీఏఐ ఏర్పాటయ్యింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి అంగీకరించడంతో, ఆర్థిక సేవల నియంత్రణ సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరి, ప్రజ్వలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని