జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్‌

అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి.

Updated : 21 Apr 2024 09:17 IST

 వాటికి కేంద్రంగా మారుతున్న భారతదేశం
అగ్ర స్థానంలో బెంగళూరు, హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండటం, బలమైన అంకుర సంస్థల వ్యవస్థ, ప్రభుత్వ మద్దతు.. అత్యంత సానుకూలమైన అంశాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బహుళ జాతి సంస్థలు నూతన జీసీసీలను భారతదేశంలో అధికంగా స్థాపిస్తున్నాయని ఏఎన్‌ఎస్‌ఆర్‌ అనే కన్సల్టెన్సీ సేవల సంస్థ తన త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జీసీసీ కేంద్రాల వ్యాపారం విలువ ప్రస్తుతం 46 బిలియన్‌ డాలర్లు కాగా, 2030 నాటికి ఇది 110 బిలియన్‌ డాలర్లకు(రూ.9లక్షల కోట్లకు పైగా) పెరగగలదని అంచనా. దాదాపు 2400 జీసీసీల్లో 45 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

ఏఐ/ ఎంఎల్‌ ప్రాజెక్టుల కోసం..

జీసీసీ కేంద్రాలను ఆకర్షించటంలో బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో బెంగళూరు వాటా 30 శాతం కాగా, 19 శాతం వాటాతో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలకు పోటీగా అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీ, జీసీసీ కేంద్రస్థానంగా గుర్తింపు సాధిస్తోంది. గిఫ్ట్‌ సిటీలో ఎస్‌ఈజడ్‌ సదుపాయాలు, పన్ను రాయితీలు, తక్కువ వ్యయాలు, లావాదేవీల నిర్వహణ సరళతరంగా ఉండటంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు గిఫ్ట్‌ సిటీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికే అధిక సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌), డేటా అనలిటిక్స్‌ ప్రాజెక్టులు చేపట్టగల సత్తా ఉన్న కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో ఏడీఎం (అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) అవసరాల కోసం ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఐ/ ఎంఎల్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ సత్తా కల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకే మెజార్టీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సేవలు, హై ఎండ్‌ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఉత్పత్తి, రిటైల్‌ విభాగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఏఐ/ ఎంఎల్‌ ప్రాజెక్టులకు అధికంగా ఇస్తున్నాయి. దానికి అనువుగా జీసీసీ లను ఏర్పాటు చేస్తున్నారు.

సత్తానే ప్రామాణికం...

గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా వాటిని స్థాపించే కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచి లేదా ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారిని నియమించటం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తన, మన అనే ప్రామాణికం కాకుండా, సత్తా ఎవరికి ఉంటే వారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. జెనరేటివ్‌ ఏఐ, ఏఐ/ఎంఎల్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్ద పీట వేస్తున్నారు.

రియల్‌ ఎస్టేట్‌కు గిరాకీ

జీసీసీల ఏర్పాటుతో ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగవంతమైన వృద్ధి నమోదు చేసే అవకాశం ఏర్పడుతోంది. మనదేశంలో దాదాపు 15 నగరాల్లో జీసీసీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీల కోసం 2025 నాటికి దాదాపు 6 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కల ఆఫీసు స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలైన అహ్మదాబాద్‌, కోయంబత్తూరు, భువనేశ్వర్‌, వడోదర.. జీసీసీలను అధికంగా ఆకర్షిస్తున్నాయి. జీసీసీల ఏర్పాటులో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసే సంస్థల ప్రాధామ్యాలు కూడా మారుతున్నట్లు ఏఎన్‌ఎస్‌ఆర్‌ సహ వ్యవస్థాపకుడు, టాలెంట్‌500 సీఈఓ విక్రమ్‌ అహుజా అన్నారు. డిజిటల్‌ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికి ఆయా సంస్థలు ఇష్టపడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశీయంగా ఐటీలో కొత్త ఉద్యోగాల లభ్యత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా మనదేశానికి ఉన్న ఐటీ సామర్థ్యాన్ని ఇతరదేశాలు గుర్తించేందుకు ఈ మార్పు వీలు కల్పిస్తున్నట్లు విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని