రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?

Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం..

Updated : 09 May 2024 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక కంపెనీ ఐపీఓకి (IPO) రావడానికి ముందు చాలా పెద్ద ప్రక్రియే ఉంటుంది. ముందుగా సెబీకి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి. దరఖాస్తులో వ్యాపారానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలి. సెబీకి అందించడమంటే వాటిని బహిర్గతం చేసినట్లే. తద్వారా ఇన్వెస్ట్‌ చేయబోయే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే, ఇటీవల చాలా కంపెనీలు రహస్య మార్గంలో ఐపీఓకు (Public Issue) దరఖాస్తు చేసుకుంటున్నాయి. అంటే సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం లేదు. మరి దీని వెనకున్న మతలబేంటి? సెబీ ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది? చూద్దాం..

ఏంటీ రహస్య మార్గం..

ఐపీఓకు (IPO) దరఖాస్తు కోసం ప్రాథమిక పత్రాలను సమర్పించేందుకు అనుమతించిన ప్రత్యామ్నాయ మార్గమే ఈ ‘కాన్ఫిడెన్షియల్‌ ఫైలింగ్‌’. సెబీ దీన్ని 2022లో ప్రవేశపెట్టింది. సాధారణంగానైతే ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నప్పుడే ప్రాథమిక పత్రాలన్నింటినీ బహిర్గతం చేస్తారు. కొత్త విధానంలో మాత్రం అలా ఉండదు. ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వరు. సెబీ క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా సవరణలు సూచిస్తే కంపెనీ వాటిని పూర్తి చేస్తుంది. తర్వాత ఐపీఓ తేదీ, ధరల శ్రేణి సహా ఇతర వివరాలను నిర్ణయించిన తర్వాత ప్రాథమిక పత్రాలను పబ్లిక్‌కు అందుబాటులో ఉంచుతారు.

ఏ కంపెనీలు చేసుకున్నాయి..

కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టాటా ప్లే తొలిసారి ఈ మార్గంలో దరఖాస్తు చేసకుంది. తర్వాత ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో సైతం ఆ బాటలోనే పయనించింది. తాజాగా స్విగ్గీ రహస్యంగా పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది.

ప్రయోజనాలివే..

భద్రంగా కీలక సమాచారం: ఆర్థిక వివరాలు, వ్యాపార రహస్యాలు, వ్యూహాలు, న్యాయపరమైన అంశాలు సహా ప్రాథమిక పత్రాల్లో అనేక వివరాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఐపీఓ ప్రారంభించడానికి చాలా సమయం ఉంటుంది. ఈ మధ్యలో కీలక సమాచారమంతా పబ్లిక్‌లో ఉండడం వల్ల వ్యాపారానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రత్యర్థి సంస్థలు వాటిని కొల్లగొట్టి లబ్ధి పొందే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రహస్య మార్గం వల్ల కీలక సమాచారం బయటకు వెళ్లకుండా ఉంటుంది.

ఐపీఓ రద్దయినప్పుడు..: దరఖాస్తు చేసుకున్న అన్ని కంపెనీలు ఐపీఓకి రావడం లేదు. వివిధ కారణాల వల్ల పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలను పక్కనపెడుతున్నాయి. అలాంటప్పుడు కీలక సమాచారమంతా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచితే ప్రయోజనాలు దెబ్బతిన్నట్లే. అదే రహస్య మార్గంలో అయితే ఐపీఓకి వచ్చినప్పుడు మాత్రమే కీలక వివరాలు బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది.

సవరణలకు అవకాశం: ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే సెబీ తెలియజేస్తుంది. కంపెనీ వాటిని సవరించి మరోసారి పత్రాలను సమర్పిస్తుంది. ఇది ఇన్వెస్టర్లలో సందేహాలకు దారితీసే అవకాశం ఉంది.  అదే రహస్య మార్గంలో అయితే ఎలాంటి సమాచారం బయటకు రాకముందే సెబీతో చర్చలు జరపొచ్చు. నియంత్రణపరంగా ఏమైనా మార్పులుంటే చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రతికూలతలు..

ఫైలింగ్‌ను రహస్యంగా ఉంచడం వల్ల కంపెనీలు ఐపీఓకు (IPO) రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మదుపర్లను నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. అలాగే కొత్త మార్గాన్ని ఎంచుకున్న కంపెనీలు మొత్తం మూడు దఫాల్లో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే వ్యయం కూడా ఎక్కువే. ఈ దశలో ఎక్కడ సమాచారం బయటకు లీకైనా ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు దారితీసే ప్రమాదం ఉంది.

ఇతర దేశాల్లోనూ..

అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో రహస్య మార్గంలో ఐపీఓ దరఖాస్తు విధానం అమల్లో ఉంది. తొలుత కంపెనీలు తమ పత్రాలను నియంత్రణ సంస్థల పరిశీలనకు పంపుతాయి. అక్కడ ఆమోదం లభించి ఐపీఓకు వెళ్లాలనుకున్నప్పుడే సమాచారాన్ని బయటకు బహిర్గతం చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు