ఇదీ.. ఇండిగో సత్తా

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది.

Updated : 11 Apr 2024 06:52 IST

మార్కెట్‌ విలువ రూ.1.46 లక్షల కోట్లు
అమెరికా సంస్థను అధిగమించి ప్రపంచంలో మూడో స్థానం

దిల్లీ: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. ఇండిగో బ్రాండ్‌పై సేవలందిస్తున్న విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు దూసుకెళ్లడమే ఇందుకు కారణం.

ఏడాది క్రితం మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచ అగ్రశ్రేణి-10 విమానయాన సంస్థల జాబితాలో ఇండిగో లేదు. తాజాగా ఏకంగా అగ్రగామి మూడో సంస్థగా నిలవడం విశేషం. దేశీయంగా చౌకధరల విమాన సేవలు అందిస్తూ, ప్రయాణికులను చేరవేయడంలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న ఇండిగో, మార్కెట్‌ విలువను మరింతగా పెంచుకోగలిగింది.

విమానయాన సంస్థల్లో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ 30.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.52 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువతో ప్రపంచ విమానయాన సంస్థల్లో అగ్రగామిగా ఉంది. ఐర్లాండ్‌కు చెందిన చౌకధరల విమానయాన సంస్థ ర్యానైర్‌ హోల్డింగ్స్‌ సంస్థ 26.5 బి.డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల)తో రెండో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన చౌకధరల విమానయాన సంస్థ సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ మార్కెట్‌ విలువ 17.3 బి.డాలర్లు (సుమారు రూ. 1.44 లక్షల కోట్లు) కాగా.. 17.6 బి.డాలర్ల (సుమారు రూ. 1.46 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువతో ఇండిగో మూడోస్థానాన్ని ఆక్రమించింది.

నెలరోజుల్లో 22% రాణించిన షేరు: ఇండిగో షేరు గత నెల రోజుల్లోనే 22% పెరిగింది. గత ఏడాది కాలంలో షేరు ధర సుమారు రెట్టింపు అయ్యింది. గత ఏడాది మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచ జాబితాలో 14వ స్థానంలో ఇండిగో ఉండేది. తాజాగా ఈ షేరు వరుసగా  4 రోజులు పెరిగింది.  బుధవారం బీఎస్‌ఈలో 4.82%  పెరిగి రూ.3,806.85 వద్ద ముగిసింది. ఒక దశలో 5% పెరిగి రూ.3,815.10 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ 4 రోజుల్లో షేరు విలువ 9% దూసుకెళ్లి, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,175.7 కోట్ల మేర పెరిగింది.

ఇవీ కారణాలు: దేశీయంగా విమాన ప్రయాణానికి గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. పలు కారణాల వల్ల ఇతర సంస్థల విమాన సర్వీసులు తగ్గుతున్నాయి. ఇది ఇండిగోకు కలిసివస్తోంది. అంతర్జాతీయ సేవల్లోనూ దేశీయ సంస్థల వాటా అధికమవుతోంది. నీ నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగు పరచుకోవడం, వ్యయాలను నియంత్రించడమే ఇండిగో విజయాలకు మూలమని విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని