RERA act: రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌?

RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం.

Updated : 29 May 2024 13:27 IST

RERA act | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రీ లాంచింగ్‌ ఆఫర్ల పేరుతో బురిడీ కొట్టేవారు కొందరైతే.. ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకుని ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను కాలయాపన చేసే వారు మరికొందరు. నాణ్యత లోపాలు ఇల్లు అంటగట్టే వారు ఇంకొందరు. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ ఎంత వేగంగా వృద్ధి చెందుతోందో.. ఇలాంటి మోసాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందుకు సామాన్యులే కాదు, సెలబ్రిటీలు బాధితులవుతున్నారు. తాజాగా సినీ నటుడు జగపతి బాబుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అపార్ట్‌మెంట్‌ను నిర్మించి ఇచ్చారని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ సైతం దిల్లీలోని పలు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూమి కొనే ముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నిబంధనలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ మోసాల నుంచి రక్షణ కవచంలా ఉపయోగపడే ఈ చట్టం ఏం చెబుతోంది?

వ్యాపార ధోరణితో సాగే స్థిరాస్తివ్యాపారంలో ఇంటి కొనుగోలులో నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకు కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం (RERA act) తీసుకురాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి. రెరా అనుమతి లేనిదే ఏ స్థిరాస్తి ప్రాజెక్టు నిర్మాణాలను, అమ్మకాలను చేపట్టరాదు. ఒకవేళ అథారిటీ అనుమతి పొందిన స్థిరాస్తి విషయంలో ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే రెరాలో పొందుపర్చిన న్యాయాధికారి ద్వారా తక్షణ న్యాయం పొందేందుకు వెసులుబాటు ఉంది.

నన్నూ మోసం చేశారు.. మీరూ జాగ్రత్తగా ఉండండి: జగపతి బాబు

ఇంతకీ ఈ చట్టం ఏం చెబుతోంది?

రెరా (RERA) గుర్తింపు లేకుండా 8 ప్లాట్లు/ 500 చ.మీ. దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు. ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టరాదు. దరఖాస్తు చేసే సమయంలోనే వారికి ఈ రంగంలో ఉన్న అనుభవం, నిర్మాణానికి కావాల్సిన మూలధన వివరాలను వెల్లడించాలి. నిర్మాణంలో సేవలందించే వేర్వేరు భాగస్వాములు ఇంజినీరు, అర్కిటెక్ట్‌, ఎంఈపీ, సీఏ, కాంట్రాక్టరు తదితర వివరాలను రెరాకు తెలియజేయాలి. రెరా నుంచి నమోదు పత్రం లేకుండా నిర్మాణానికి సంబంధించి ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలను వేయరాదు. ప్రీలాంచ్‌ విక్రయాలు చేపట్టరాదు.

స్వాధీన తేదీ ముందే..

కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములో 70 శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేసి అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. ప్రత్యేక ఖాతా నుంచి నగదును ఇతర అవసరాలకు తీసుకోవడానికి వీల్లేకుండా నిబంధనలు రూపొందించారు. ప్రతి త్రైమాసికానికి జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి. కొనుగోలుదారుల నుంచి ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా బయానాగా తీసుకోవాలంటే ఇరువురి మధ్య సిఫార్సు చేసిన నమూనా ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. బయానా తీసుకున్న రోజే ఇంటిని స్వాధీన పర్చే తేదీని లిఖితపూర్వకంగా వెల్లడించాలి. ఒప్పందం ప్రకారం పనులను, సౌకర్యాలను కల్పించాలి. ఏ పనిని, ఏ రోజుకు పూర్తిచేస్తామనే విషయాలపై సవివరంగా హామీ ఇవ్వాలి.

ఒప్పందంలో, ప్లాన్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా నిర్మాణంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి ఉండాలి. నిర్మాణ పురోగతిని ప్రతి మూడు నెలలకోసారి నివేదిక, చిత్రాలను రెరా వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి. స్థిరాస్తి కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. అందుకే మధ్యవర్తిని కూడా రెరా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వారికి చట్టబద్ధంగా గుర్తింపునకు నమోదు ప్రక్రియను రూపొందించింది. మధ్యవర్తి చేసే సేవా లోపాలకు నిర్మాణదారుడిని సహ బాధ్యుడిగా నిబంధనల్లో పేర్కొన్నారు.

భూముల ధరల సవరణకు సరైన సమయమేనా?

ఆలస్యమైతే వడ్డీ..

ఒప్పందంలో పేర్కొన్న తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేసి ఇంటిని కొనుగోలు దారులకు అప్పగించాలి. గడువు దాటినా స్వాధీన పర్చనట్లయితే రెరా సిఫార్సు చేసిన వడ్డీని ప్రతినెలా కొనుగోలుదారుకు చెల్లించాలి. నాణ్యతా లోపాలకు నిర్మాణదారే ఐదేళ్ల వరకు బాధ్యుడిగా చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా లోపాలను కొనుగోలుదారుడు బిల్డర్‌ దృష్టికి తీసుకెళితే ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలి. నిర్మాణం పూర్తయి ఆస్తులను విక్రయించాక కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఉమ్మడి ఆస్తి, సదుపాయాలను వారికి అప్పగించడం కూడా నిర్మాణదారే చేయాలని చట్టం చెబుతోంది. రెరా (RERA) ప్రకారం కార్పెట్‌ ఏరియా, ఫ్లింత్‌ ఏరియా, కామన్‌ ఏరియాను విడివిడిగా చూపించాలి. ఇదివరకు మూడూ కలిపి సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా విక్రయించేవారు.

రిజిస్ట్రేషన్ చూశాకే..

ఏదైనా లేఅవుట్‌లో స్థలం తీసుకుంటున్నా, బహుళ అంతస్తు నిర్మాణంలో ఫ్లాట్‌ కొనుగోలు చేస్తున్నా రెరా రిజిస్ట్రేషన్‌ ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ నమోదైన ప్రాజెక్ట్‌ అయితే ఏపీ/ తెలంగాణ రెరా (RERA) వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడునెలలకు ప్రాజెక్ట్‌ పురోగతి వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.
రెరా వెబ్‌సైట్స్‌: ఏపీ: rera.ap.gov.inతెలంగాణ: rera.telangana.gov.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని