విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?

విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్‌ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది.

Updated : 10 Apr 2024 06:41 IST

సవాలు భరిత సమయంలో బాధ్యతలు

విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్‌ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, వాటాదార్ల అసంతృప్తులకూ ఎదురొడ్డాల్సి ఉంది.  సీఈఓగా వ్యవహరించిన థియరీ డెలాపోర్ట్‌ శనివారం చేసిన రాజీనామాతో, ఈ ఐటీ సంస్థలో కార్యకలాపాలు- నాయకత్వ సమస్యలు తీరవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర ఐటీ కంపెనీల స్థాయిలో పనితీరు, ఫలితాల విషయంలో విప్రో రాణించడం లేదన్నది వారి అభిప్రాయం.

  •  విప్రోలో 21 ఏళ్ల పాటు పనిచేసిన జతిన్‌ దలాల్‌ సీఎఫ్‌ఓ హోదాలో రాజీనామా చేశారు. సీజీఓ స్టెఫానీ ట్రాట్‌మాన్‌, సీఓఓ సంజీవ్‌ సింగ్‌, ఇండియా హెడ్‌ సత్య ఈశ్వరన్‌ వంటి వారూ సంస్థ నుంచి బయటకెళ్లారు. ఈ పదవులకు సమర్థులను ఎంపిక చేసి, పూడ్చడం సవాలుతో కూడుకున్న పనే.

వేగంగా స్పందిస్తేనే..: విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్‌ తన ప్రణాళికలను వేగంగా నిర్ణయించుకుని, అమలు చేయాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీకి కొత్తగా దిశానిర్దేశం చేయాల్సి ఉందంటున్నారు. కంపెనీ సరైన వ్యక్తి చేతిలో ఉందని కీలక వాటాదార్లు విశ్వసించేలా చేయాలి. అంతర్జాతీయ వ్యాపార వాతావరణం స్తబ్దుగా కనిపిస్తున్నందున.. త్వరితంగా, వేగంగా కంపెనీ పుంజుకునేందుకు అవసరమయ్యే చర్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

సానుకూలతలున్నాయ్‌: శ్రీనివాస్‌కు ఉన్న అతిపెద్ద సానుకూలత ఏమిటంటే.. ఆయన విప్రోలోని వ్యక్తి కావడం. అందువల్ల వీలైనంత త్వరగా అందరూ ఆయన్ని అంగీకరించేందుకు వీలుంటుంది. అదే తన సానుకూలత అని శ్రీనివాస్‌ పేర్కొంటున్నారు. చాలా త్రైమాసికాలుగా విప్రో ఆదాయం పరిశ్రమ సగటు కంటే తక్కువగా నమోదవుతోంది. 2023 డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 12% తగ్గి  రూ.2694 కోట్లకు పరిమితమైంది. ఆదాయాలూ 4.4% తగ్గి  రూ.22,205.1 కోట్లకు చేరాయి. వరుసగా నాలుగో త్రైమాసికమూ కంపెనీ క్షీణతను చవిచూసినట్లయింది. 2024-25  ఆర్థిక సంవత్సరంలో గణాంకాలను, కంపెనీ దిశను మార్చాల్సిన పని శ్రీనివాస్‌దే. జనవరి-మార్చి  త్రైమాసిక ఫలితాలను ఈనెల 19న కంపెనీ ప్రకటించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని