Dry Promotion: డ్రై ప్రమోషన్‌.. జాబ్‌ మార్కెట్‌లో ఇదో కొత్త ట్రెండ్‌

Dry Promotion: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, మూన్‌లైటింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌, క్వైట్‌ క్విటింగ్‌ వంటి కొత్త ధోరణులు జాబ్‌ మార్కెట్‌లో ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్‌ ఆ జాబితాలో చేరింది.

Updated : 15 Apr 2024 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ జాబ్ మార్కెట్ ఎప్పటికప్పుడు కొత్త రూపును సంతరించుకుంటోంది. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, మూన్‌లైటింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌, క్వైట్‌ క్విటింగ్‌ .. వంటివన్నీ అందులో భాగమే. తాజాగా ‘డ్రై ప్రమోషన్‌’ (Dry Promotion) అనే కొత్త పదం ట్రెండింగ్‌లోకి వస్తోంది.

ఏంటీ డ్రై ప్రమోషన్‌..

సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్‌ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలూ పెరుగుతాయి. కానీ, అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్‌ (Dry Promotion) అంటున్నారు. కంపెనీలో డెసిగ్నేషన్‌ కూడా మారుతుంది. పనిభారం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కానీ, వేతనం, ప్రోత్సాహకాలు మాత్రం మారవు.

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్‌ మేయర్‌ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఇది 8 శాతంగా ఉన్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. అలాగే మెర్సర్‌ అనే సంస్థ 900 కంపెనీలను సర్వే చేసింది. వీటిలో చాలా వరకు వేతన పెంపుతో కూడిన ప్రమోషన్లకు తక్కువ బడ్జెట్‌ కేటాయించినట్లు తేలింది.

కార్పొరేట్‌ రంగంలో ఈ పదాలకు అర్థాలు తెలుసా?

ఇలా ఎందుకంటే..

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలు ఇలాంటి డ్రై ప్రమోషన్‌ (Dry Promotion) విధానాన్ని అనుసరిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఉద్యోగ కోతల నేపథ్యంలో చాలా సంస్థల్లో సిబ్బంది తగ్గిన విషయం తెలిసిందే. దీంతో కీలక బాధ్యతలను అప్పగించడం కోసం కొందరిని ఇలా ప్రమోట్‌ చేస్తుంటారని వివరించారు. 

ఈ ట్రెండ్‌ నిజంగానే కొనసాగుతున్నట్లు ఇటీవల పలువురు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కంపెనీలో తన హోదాకు మించి పనిచేస్తున్న నేపథ్యంలో తన జాబ్‌ టైటిల్‌ నుంచి ‘జూనియర్‌’ అనే పదాన్ని తొలగించారని ఓ ఉద్యోగి ఇటీవల రెడిట్‌ థ్రెడ్‌లో పేర్కొన్నారు. వేతనంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని వెల్లడించారు. టైటిల్‌ మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనమూ ఉందంటున్నారు మరికొందరు. జాబ్‌ మారాలనుకునేవారు కొత్త కంపెనీలో ఉన్నత హోదాలో బాధ్యతలు స్వీకరించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆఫీసుకు కచ్చితంగా రావాలని కంపెనీలు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్‌ (Coffee Badging) విధానాన్ని అవలంబించిన విషయం తెలిసిందే. రమ్మన్నారు కదా అని అలా వచ్చి కాసేపు కాఫీ తాగి మేనేజర్లు, హెచ్‌ఆర్‌ల దృష్టిలో పడి ఇంటికి వెళ్లడాన్నే కాఫీ బ్యాడ్జింగ్‌గా వ్యవహరించారు. యాజమాన్యానికి తెలియకుండా రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అన్నారు. కేవలం అప్పగించిన బాధ్యతలకు మాత్రమే పరిమితమై ఇతర పనుల నుంచి తప్పించుకోవడాన్ని క్వైట్‌ క్విటింగ్‌గా పేర్కొన్నారు. ఇలా కార్పొరేట్‌ రంగంలో అనేక పదాలు ఇటీవల తెరపైకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని