Updated : 04 Apr 2022 15:11 IST

Cryptocurrency: క్రిప్టోలకు పన్ను పోటు.. తగ్గిన లావాదేవీలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ తొలి మూడు రోజుల్లో దేశీయ క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో వాల్యూమ్స్‌ భారీగా పడిపోయాయి. ఎక్స్ఛేంజీని బట్టి ఈ పతనం 15-55 శాతం మధ్య ఉంది. ఎక్స్ఛేంజీలను ఆశ్రయించే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. 

వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే భారత్‌లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు 1 శాతం టీడీఎస్‌ విధించనున్నారు. మరోవైపు ఒక లావాదేవీలో సంభవించిన నష్టాన్ని మరో లావాదేవీ లాభంతో పూడ్చుకోవడానికి అవకాశం కూడా కల్పించలేదు. మరోవైపు క్రిప్టోను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే యోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అనిశ్చితిలో కదలాడే క్రిప్టో మార్కెట్ల నుంచి ఈ నియమాలన్నీ రిటైల్‌ ట్రేడర్లను దూరం చేయనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాల్యూమ్స్‌ పడిపోయిన విషయాన్ని దేశీయ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన వజీరిక్స్‌ సీఈఓ నిశ్చల్‌ శెట్టి ధ్రువీకరించారు. గత రెండు వారాల్లో క్రిప్టో కరెన్సీ విక్రేతలు 30 శాతం పెరిగినట్లు తెలిపారు. అయితే, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుందనేందుకు వీలు లేదన్నారు. బిట్‌కాయిన్‌ విలువ 11 శాతం మేర పెరిగిన నేపథ్యంలో లాభాల స్వీకరణకు కూడా మదుపర్లు విక్రయాలు జరిపి ఉంటారని తెలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన పన్ను విధానం క్రిప్టో మార్కెట్లపై ఎలా ఉండనుందో స్పష్టంగా తెలిసే వరకు మదుపర్లు వేచి చూడాలని ఆయన కోరారు. ఈ నెల మూడో వారం నాటికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, భారత్‌లో క్రిప్టో మార్కెట్‌కు ప్రతికూల వాతావరణం ఏర్పడుతోందని ఓ ప్రముఖ సంస్థ 97 మంది బ్లాక్‌చైన్‌ డెవలపర్లతో నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. దీంతో వీరంతా విదేశాలకు తరలిపోయే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

భారత్‌లో క్రిప్టో కరెన్సీ విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో గత మూడు నెలలుగానూ ఎక్స్ఛేంజీ విజిటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని సమాచారం. డిసెంబరు 2021లో 13.14 మిలియన్లుగా ఉన్న విజిటర్ల సంఖ్య ఫిబ్రవరి 2022 నాటికి 8.8 మిలియన్లకు పడిపోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని