Dabur India: రూ.7,000 కోట్లతో కొనుగోళ్లకు సిద్ధమైన డాబర్‌ ఇండియా

Dabur India: సొంతంగా కొన్ని కొత్త బ్రాండ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు డాబర్‌ ఇండియా తెలిపింది. అలాగే ఇతర కంపెనీలు, బ్రాండ్ల కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

Published : 08 Nov 2023 20:32 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్‌ ఇండియా (Dabur India) వద్ద రూ.7,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు కంపెనీ సీఈఓ మోహిత్‌ మల్హోత్రా తెలిపారు. వీటితో ఇతర కంపెనీల కొనుగోళ్లకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ, గృహ- వ్యక్తిగత సంరక్షణ రంగంలోని కంపెనీలు, బ్రాండ్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సహా ‘డైరెక్ట్‌ టు కస్టమర్‌’ ప్లాట్‌ఫాంపై ఉన్న కంపెనీలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్‌ వృద్ధికి దోహదం చేసే కంపెనీలు, బ్రాండ్లు తగిన విలువ వద్ద లభిస్తే తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటికే ఉన్న బ్రాండ్లను ఇ-కామర్స్‌లోకి తీసుకొస్తున్నామని మోహిత్‌ వెల్లడించారు. కంపెనీ (Dabur India) నుంచి సొంతంగా మరికొన్ని కొత్త బ్రాండ్లను సైతం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇతర  బ్రాండ్లను కొనుగోలు చేస్తే వాటిని కూడా ఆన్‌లైన్‌ ఛానెళ్లలో అందుబాటులో ఉంచే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. చర్మ సంరక్షణ, ప్రీమియం స్కిన్‌ కేర్‌ విభాగంలో కంపెనీ సొంతంగా కొత్త బ్రాండ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. మిగిలిన విభాగాల్లో కొనుగోళ్ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటామని వివరించారు.

డాబర్‌ ఇండియా (Dabur India)కు చెందిన తొమ్మిది పవర్‌ బ్రాండ్లు రోజులు మారుతున్న కొద్దీ కొత్తరూపు సంతరించుకోవాల్సిన అవసరం ఉందని మోహిత్‌ తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగా నేటి తరాన్ని ఆకర్షించేలా బ్రాండ్లలో నూతన ఆవిష్కరణలను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లు కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు. కంపెనీ విక్రయాల్లో 70 శాతం ఈ తొమ్మిది బ్రాండ్లదే. వీటిలో ఎనిమిది భారత్‌లో ఒకటి విదేశీ మార్కెట్‌లో ఉంది. ఈ ఏడాదిలోనే బాద్‌షా మసాలాలో డాబర్‌ ఇండియా 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది. దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌లోకీ తీసుకెళ్లే యోచనలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని