Q-A: మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా ఏంటి?

నేరుగా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా పరోక్షంగా కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

Updated : 04 Oct 2022 16:08 IST

నమస్తే.. మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు. వీటిలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదో చెప్పగలరు.

- కునుకు వాసు

ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు. నేరుగా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా పరోక్షంగా కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. షేర్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెట్టుబడికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం. నిపుణులను సలహా కోరి మాత్రమే షేర్లు ఎంచుకోవడం మేలు.

ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. వారు ఎలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు. మదుపరుల నుంచి డబ్బు సమీకరించి 100-200 షేర్లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి, రిస్క్ కొంత వరకు తగ్గుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు – లంప్సమ్, అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా నెల నెలా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్‌లో మార్కెట్‌తో సంబంధం లేకుండా పెట్టుబడి పెడతాం కాబట్టి రిస్క్ మరి కాస్త తగ్గుతుంది. కనీసం 10 ఏళ్ల పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.


పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ల కాలపరిమితి ముగిశాక దాన్ని కొనసాగించాలా లేక డబ్బు వెనక్కి తీసుకోవాలా?

- కొల్లిపర సుందరయ్య

పీపీఎఫ్ ఖాతా ద్వారా మంచి రాబడితో పాటు సెక్షన్ 80C ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీన్ని 5 ఏళ్ల చొప్పున (పరిమితి లేకుండా) కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే, ఖాతాను మరో 5 లేదా 10 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారైతే పోస్ట్ ఆఫీస్ పెద్దల పొదుపు పథకం (SCSS) లో కూడా మదుపు చేయవచ్చు. దీని వడ్డీ పీపీఎఫ్‌తో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉంటుంది.


నా పేరు మధు. నేను మ్యాక్స్‌ లైఫ్ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి తీసుకోవడం మేలు?

- మధు

మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా బాగుంది. ఈ కంపెనీకి సంబంధించిన పాలసీని మీరు మీ వీలు ప్రకారం పాలసీబజార్, కవర్ ఫాక్స్ లేదా మ్యాక్స్‌ లైఫ్ వెబ్‌సైట్‌లో ఎక్కడ నుంచి తీసుకున్నా పరవాలేదు. మ్యాక్స్‌ లైఫ్‌తో పాటు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కంపెనీ టర్మ్ పాలసీల ప్రీమియం పోల్చి చూసుకోండి. మీకు 60 ఏళ్లు వచ్చేదాకా పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ఉంటాయి.


మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు మార్గాలు తెలపండి. వాటి మధ్య వ్యత్యాసాలు కూడా తెలుపగలరు.

- భరత్ రెడ్డి

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ఆఫీసుని సందర్శించి (లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా) ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పెట్టుబడి పెట్టొచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. ఇది ఫండ్ ను బట్టి 1-2 శాతం వరకు ఉండొచ్చు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యుల‌ర్‌ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. కొంత వరకు సమయం కేటాయించి మ్యూచువల్ ఫండ్లపై అవగాహన తెచ్చుకున్న తరువాత డైరెక్టు ప్లాన్లో మదుపు చేయడం మేలు. దీర్ఘకాలంలో చాలా వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు