సంక్షిప్త వార్తలు(7)

టాటా పవర్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.1,052.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.551.89 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

Published : 04 Feb 2023 01:45 IST

టాటా పవర్‌ లాభం రెట్టింపు

దిల్లీ: టాటా పవర్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.1,052.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.551.89 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.  మొత్తం ఆదాయంరూ.11,018.73 కోట్ల నుంచి రూ.14,401.95 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌-డిసెంబరులో నికర లాభం రూ.2,871 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,523 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం ఎక్కువ.  ఆదాయం కూడా రూ.30,491 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.43,278 కోట్లకు చేరింది.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభంలో 75% వృద్ధి

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) ఏకీకృత నికర లాభం 74.76 శాతం వృద్ధితో రూ.4,305.66 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడానికి తోడు, అధిక వడ్డీ ఆదాయం ఇందుకు దోహదం చేశాయి. స్టాండలోన్‌ పద్ధతిలోనూ నికర లాభం 75.4 శాతం వృద్ధితో రూ.3,853 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 26.5 శాతం పెరిగి రూ.10,818 కోట్లకు చేరింది. రుణాల్లో 20% వృద్ధి లభించడం, నికర వడ్డీ మార్జిన్‌ 0.24% పెరిగి 3.37 శాతానికి చేరడంతో ఇది సాధ్యమైంది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 7.25 శాతం నుంచి 4.53 శాతానికి పరిమితమయ్యాయి.  


రూ.392 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టం

దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో పేటీఎం ఏకీకృత ప్రాతిపదికన రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల నష్టం రూ.778.4 కోటతో పోలిస్తే ఈ సారి బాగా తగ్గింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,456.1 కోట్ల నుంచి రూ.2,062.2 కోట్లకు పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం లక్ష్యాన్ని అందుకుందని, ఈసాప్‌ వ్యయాలు ఇందులో లేవని సంస్థ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.


ఇండిగోకు భారీ లాభం

దిల్లీ: విమాన ప్రయాణాలకు గిరాకీ పెరగడంతో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ రాణించింది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,422.6 కోట్లకు చేరుకుంది. 2021-22 ఇదే కాల లాభం రూ.129.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం సైతం రూ.9,480.1 కోట్ల నుంచి రూ.15,410.2 కోట్లకు పెరిగింది. విదేశీ మారక నష్టాన్ని మినహాయిస్తే కంపెనీ లాభం రూ.125.2 కోట్ల నుంచి రూ.2,009.1 కోట్లకు చేరుకున్నట్లయింది. సంస్థ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 1.78 కోట్ల నుంచి 26 శాతం అధికమై 2.23 కోట్లకు చేరింది. త్రైమాసికం వారీ అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు.


దివీస్‌ లేబొరేటరీస్‌ లాభాల్లో క్షీణత  

ఈనాడు, హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,822 కోట్ల ఆదాయంపై రూ.307 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.2,510 కోట్లు, నికరలాభం రూ.902 కోట్లు ఉండటం గమనార్హం. ఉత్పత్తుల్లో మార్పుల వల్ల,  ముడిపదార్థాల వ్యయం ఆదాయంలో 43 శాతానికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు దివీస్‌ ఆదాయం రూ.6,099 కోట్లు, నికరలాభం రూ.1,502 కోట్లు ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,503 కోట్లు కాగా, నికరలాభం రూ.2,066 కోట్లుగా ఉంది.


జనవరిలో కాస్త నెమ్మదించిన సేవల రంగం

దిల్లీ: జనవరిలో దేశ సేవల రంగం వృద్ధి నెమ్మదించింది. భవిష్యత్తుపై సర్వీస్‌ ప్రొవైడర్ల విశ్వాసం స్తబ్దుగా ఉండటం, ఉద్యోగాల సృష్టిపై ఇది ప్రభావం చూపడం ఇందుకు నేపథ్యం. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇండియా సేవల పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ జనవరిలో 57.2 పాయింట్లుగా నమోదైంది. డిసెంబరులో ఇది 58.5గా ఉంది. డిసెంబరుతో పోలిస్తే వృద్ధి తగ్గినప్పటికీ.. దీర్ఘకాల సగటు (53.5) ఎగువనే తాజా గణాంకాలు నిలిచాయి. సానుకూల గిరాకీ పరిస్థితులు, ప్రస్తుత పనులు పుంజుకోవడం కలిసొచ్చాయి. వరుసగా 18వ నెలా సేవల రంగం కీలకమైన 50 పాయింట్ల స్థాయి ఎగువనే ఉంది. ఈ సూచీ 50కి కింద క్షీణతగా.. 50కి పైన వృద్ధిగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో సేవల రంగ వృద్ధి కొంత జోరు కోల్పోయిందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలీనా డి లిమా పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌లో కొత్త వ్యాపారాలు పెరిగాయని, అంతర్జాతీయ ఆర్డర్లు తగ్గాయని తెలిపారు.


త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలు

నాగ్‌పుర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ వ్యవస్థను బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలోనే ఆవిష్కరించనుందని కంపెనీ డైరెక్డర్‌(హెచ్‌ఆర్‌) అరవింద్‌ వడ్నేర్కర్‌ పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలోనే 5జీ సేవలనూ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ శాచురేషన్‌ ప్రాజెక్ట్‌ కింద 28,000 గ్రామాల్లో సేవలందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా మొబైల్‌ కవరేజీ లేని గ్రామాలూ వీటిల్లో ఉంటాయన్నారు. నిధులు, ఇతర వనరులతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం చేయూతనిస్తోందని వివరించారు. 2026-27 కల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ నికర లాభాలను నమోదు చేయగలదని ఆయన పేర్కొన్నారు.  


ఇమామి లాభం రూ.983 కోట్లు

దిల్లీ: దేశీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ, డిసెంబరు త్రైమాసికంలో రూ.232.97 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.219.52 కోట్లతో పోలిస్తే, ఇది 6.12% అధికం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్ల స్థూల మార్జిన్లు తగ్గడం వల్లే, లాభం పరిమితమైందని సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో కార్యకలాపాలపై ఆదాయం రూ.971.06 కోట్ల నుంచి 1.2 శాతమే పెరిగి రూ.982.72 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.629.52 కోట్ల నుంచి 9.36 శాతం పెరిగి రూ. 688.47 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో స్థూల మార్జిన్లు 150 బేసిస్‌ పాయింట్లు తగ్గి, 65.9 శాతానికి పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ తక్కువగానే నమోదైందని సంస్థ తెలిపింది. పట్టణాల్లో షాపింగ్‌మాల్స్‌ ద్వారా వ్యాపారం 20%, ఇ కామర్స్‌ విభాగం 45% పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

* బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా రూ.330 కోట్ల విలువైన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లను సీ/డీ ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీ, హెచ్‌/డీ ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీలు విక్రయించాయి. ఒక్కో షేరును సగటున రూ.37.2 చొప్పున 8,86,58,600 షేర్లను ఈ రెండు సంస్థలు విక్రయించాయి. కంపెనీలో ఇవి 1.5 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను వేదా ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీ, డీవీజీ 1740 ఫండ్‌ ఎల్‌పీ, డెక్కన్‌ వ్యాల్యూ ఇన్వెస్టర్స్‌ ఫండ్‌ ఎల్‌పీ కొనుగోలు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని