వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి

రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 30 Apr 2024 02:15 IST

 వసూలు చేసిన అదనపు ఛార్జీలను తిరిగి ఇచ్చేయాలి
బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన అదనపు రుసుములను తిరిగి చెల్లించాలని సోమవారం బ్యాంకులను ఆదేశించింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని (ఆర్‌ఈ) సంస్థలకు పలు సందర్భాల్లో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. రుణదాతలు వడ్డీ వసూలు చేయడంలో న్యాయబద్ధత, పారదర్శకతను పాటించాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తాయి. అదే సమయంలో రుణాల వడ్డీ విధానానికి సంబంధించిన స్వేచ్ఛనూ అందిస్తాయి. 2023 మార్చి 31తో ముగిసిన కాలానికి ఆర్‌ఈలను పరిశీలిస్తున్న క్రమంలో, రుణదాతలు కొన్ని అన్యాయమైన పద్ధతులను పాటిస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. వీటిని ప్రస్తావిస్తూ.. అన్ని ఆర్‌ఈలు రుణాల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేయడంతోపాటు, దిద్దుబాటు చర్యలూ తీసుకోవాలని సూచించింది.

 రుణం ఇచ్చిన తేదీ నుంచే వసూలు చేయాలి: ఆర్‌ఈల క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో, రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందాన్ని అమలు చేసిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేయడాన్ని గమనించినట్లు తెలిపింది. వాస్తవానికి ఇది రుణం పంపిణీ చేసిన తేదీ నుంచి లెక్కించాలి. రుణం మంజూరైన చాలా రోజులకు ఆ మొత్తం అందించినా, వడ్డీని ముందే వసూలు చేస్తున్నారని ఆక్షేపించింది.

  • కొన్ని ఆర్‌ఈలు రుణం బాకీ ఉన్న కాలానికి మాత్రమే కాకుండా, మొత్తం నెలకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది.
  • కొన్ని సందర్భాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను ముందే వసూలు చేస్తున్నాయన్న సంగతినీ గుర్తించింది. ఇవన్నీ న్యాయమైన, పారదర్శకత స్ఫూర్తికి అనుగుణంగా లేవనీ ఆర్‌బీఐ పేర్కొంది. ఇలాంటి పద్ధతులను అవలంబించిన రుణ సంస్థలు వెంటనే అదనపు వడ్డీలు, ఇతర ఛార్జీలను రుణగ్రహీతలకు తిరిగి చెల్లించాలని తన సర్క్యులర్‌లో ఆదేశించింది. రుణ పంపిణీ కోసం చెక్కులకు బదులు ఆన్‌లైన్‌లోనే బదిలీ చేయాలనీ సూచించింది. సర్క్యులర్‌లో పేర్నొన్న ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయనీ ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని