డిజిటల్ చెల్లింపుల్లో సంస్థలకు సాయం చేస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది.
ఈనాడు - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది. డిజిటల్ చెల్లింపులు అధికంగా ఉన్న ఈ రోజుల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ డిజిటల్ చెల్లింపులకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో పుట్టిన అంకురమే ఎన్‌పే. బిల్లుల వసూలులో పారదర్శకంగా ఉండటంతో పాటు, ఖర్చులను తగ్గించుకునేందుకు మేము సహాయం చేస్తామంటున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ భరత్ గుత్తా. తమ అంకురం గురించి ఇలా వివరిస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో చాలా సంస్థలకు బిల్లులను వసూలు చేయడం కష్టతరమయ్యింది. వినియోగదారులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా తీసుకోలేని పరిస్థితి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వ్యత్యాసం ఎంతో ఉంది. ప్రత్యేకించి, సేవలను అందిస్తున్న సంస్థలకు సులభంగా డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యవస్థ అందుబాటులో లేదు. విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నాకు ఈ విషయం అర్థమయ్యింది. దీనికి పరిష్కారం కోసం నాకున్న ఆలోచనలను నా చిన్ననాటి మిత్రులైన ఆకాశ్ చోడే, రామకృష్ణలతో పంచుకున్నాను. ఆ తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్‌ను సంప్రదించాం. ఇలా మా సంస్థ ఎన్‌పే (ఎన్‌పేయాప్.కామ్) ఆవిర్భవించింది.
ఏం చేస్తామంటే..
విద్యుత్ సంస్థలు, బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా 25కు పైగా రకాల సంస్థలు నెలవారీ బిల్లులను డిజిటల్‌గా వసూలు చేయడంలో మేము సహాయం చేస్తాం. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, క్రెడ్, బ్యాంక్ మొబైల్ యాప్‌లు తదితర వాటిల్లో ఆయా సంస్థలు కనిపిస్తాయి. అంతేకాదు.. ఇ-సేవ, సీఎస్‌సీ కేంద్రాల్లోనూ బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్‌పే ఆయా సంస్థలు డిజిటల్ చెల్లింపులు స్వీకరించేలా ప్రత్యేకంగా ఒక లింక్‌ను అందిస్తుంది. వినియోగదారులు డెబిడ్, క్రెడిట్ కార్డులతోపాటు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సంస్థలు ప్రత్యేకంగా వసూళ్ల కోసం సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చెల్లించిన తర్వాత ప్రతిసారీ వివరాలను నమోదు చేయక్కర్లేదు. బిల్లు చెల్లింపుల విషయం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. సమస్య ఉంటే ఎప్పుడైనా సరే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించే వీలుంటుంది. చెల్లింపు గేట్‌వేలు అధికంగా రుసుములు విధిస్తాయి. మేము అందులో సగం కన్నా తక్కువే వసూలు చేస్తున్నాం.
గ్రాంటులు అందుకున్నాం..
మా ఆలోచనను మెచ్చి పలు సంస్థలు గ్రాంటులను అందించాయి. ఇందులో టి-హబ్, ఐఐటీ కాన్పూర్, సిటీ బ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నుంచి రూ.10 లక్షల వరకూ గ్రాంటు లభించింది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నుంచి రూ.2 లక్షలు అందుకున్నాం. ఎన్‌పీసీఐ, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ నుంచి రూ.లక్ష బహుమతినీ గెలుచుకున్నాం. ఇప్పటి వరకూ 100కు పైగా పలు సేవలను అందిస్తున్న సంస్థలు మా సేవలను వినియోగిస్తున్నాయి. నెలకు 6 లక్షల లావాదేవీలు, రూ.1.5 కోట్ల టర్నోవర్ నమోదవుతోంది. 17 రాష్ట్రాలు, 60కి పైగా నగరాల్లో ఎన్‌పే సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న వారు, విద్యా సంస్థలు మా ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు.
దేశమంతా..
బీ2బీ రిటైల్, డిస్ట్రిబ్యూషన్ వసూళ్లను మరింత వేగంగా, తక్కువ ధరకు అందించేలా సేవలను విస్తృతం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ రుణాలు అందుబాటులో ఉండేలా ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి పనిచేయబోతున్నాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎన్‌పే సేవలను విస్తరించడం ద్వారా నెలకు రూ.10 కోట్ల టర్నోవర్ సాధించాలనేది లక్ష్యం. ఓఎన్‌డీసీని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ఆసుపత్రులకు దగ్గర చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకొని, ఆన్‌లైన్‌లోనే బిల్లు చెల్లించే వెసులుబాటును తీసుకొచ్చాం. ఈ ఏడాది చివరి నాటికి మా బృందంలో 15 మందికి పైగా ఉద్యోగులు ఉంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు