Q&A: 15 ఏళ్లలో ₹కోటి సమకూర్చుకోవడం ఎలా?

నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి.

Updated : 13 Oct 2023 12:45 IST

నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. ఈ మొత్తాన్ని నేను సురక్షితంగా ఎక్కడ మదుపు చేయాలి? నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నెలకు రూ.5 వేల వరకూ పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకాలు ఎంచుకోవాలి?

మాధవి

ముందుగా మీ బాబు భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. మీ పేరుపై తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ పాలసీని ఎంచుకోండి. మీరు ఒక్కరే సంపాదిస్తున్నారు కాబట్టి, అత్యవసర నిధి ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మీ దగ్గరున్న రూ.4లక్షలను ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఈ మొత్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రూ.5వేలను దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయండి. దీనికోసం బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. స్వల్పకాలిక అవసరాల కోసం అనుకుంటే.. రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు.


నా వయసు 33. మరో 15 ఏళ్ల వరకూ ఉద్యోగం చేయాలనేది ఆలోచన. అప్పటిలోగా కనీసం రూ. కోటి జమ చేయాలనుకుంటున్నాను. ఈపీఎఫ్‌లో ప్రస్తుతం రూ.12 లక్షల వరకూ ఉన్నాయి. రూ. కోటి కోసం నెలకు ఎంత మొత్తం జమ చేయాలి?

పాండు

ప్రస్తుతం మీ దగ్గర రూ. 12 లక్షల భవిష్య నిధి మొత్తం ఉంది. దీనిపై సగటున 7.5 శాతం వార్షిక వడ్డీ (ప్రస్తుతం ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతంగా ఉంది. భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.) అనుకుంటే.. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.35,50,652 అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈపీఎఫ్‌లో జమ అవుతూనే ఉంటుంది. కాబట్టి, మీరు అనుకున్న మొత్తంలో సగం వరకూ భవిష్య నిధి నుంచే రావచ్చని అంచనా వేయొచ్చు. ఇక మిగిలిన రూ.50లక్షలు జమ చేసేందుకు ప్రయత్నించండి. నెలకు రూ.11,500లు సగటున 12 శాతం రాబడి వచ్చేలా 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేయండి.


నాలుగేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నాను. ప్రస్తుతం రూ.32 లక్షల వరకూ అసలు ఉంది. ఏడాదికి రూ.1,50,000 వరకూ అదనంగా చెల్లించడం మంచిదేనా? లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టాలా?

ప్రశాంత్‌

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి సెక్షన్‌ 24 ప్రకారం గృహరుణంపై చెల్లించే వడ్డీకి రూ.2 లక్షల దాకా మినహాయింపు వర్తిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని, ఎంత మేర రుణం ఉంటే సరిపోతుందో బ్యాంకును అడిగి తెలుసుకోండి. ఇప్పుడున్న వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే రూ.24లక్షల రుణం ఉంటే, ఏడాదికి వడ్డీ రూ.2 లక్షల వరకూ అవుతుంది. కాబట్టి, రూ.24లక్షలకు మించి ఉన్న రుణాన్ని తీర్చేయండి. భవిష్యత్తులో మినహాయింపులు పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు. అప్పుడు రుణాన్ని వేగంగా తీర్చే ప్రయత్నం చేయొచ్చు.


బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో రూ.5లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నెలకు రూ.4వేల వరకూ వెనక్కి తీసుకోవాలనేది ఆలోచన. ఇది మంచిదేనా? నష్టం వస్తుందా?

పవన్‌

త చరిత్రను పరిశీలిస్తే మంచి పనితీరున్న బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు 10-12 శాతం వరకూ రాబడినిచ్చాయి. మీరు రూ.5లక్షలు మదుపు చేసి, నెలకు రూ.4వేలు వెనక్కి తీసుకుంటే.. ఏడాదికి రూ.48వేలు అవుతుంది. అంటే, ఏడాదికి 9.6 శాతం పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నట్లు లెక్క. మీ పెట్టుబడి కనీసం 9.6 శాతానికి మించి రాబడినిస్తే రూ.5లక్షల విలువ తగ్గదు. ఒకవేళ రాబడి 9.6 శాతం కన్నా తగ్గితే.. మీ పెట్టుబడి ప్రభావితం అవుతుంది. మదుపు చేసి, ఏడాది వేచి చూడండి. ఆ తర్వాత నుంచి నెలనెలా రూ.4వేలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని