టాపప్‌ రుణంతో మదుపు చేయొచ్చా?

నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను.

Updated : 10 Nov 2023 00:08 IST

1) నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. ఒక జీవిత బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి? పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి.

మధు

ఇప్పటికే మీరు జీవిత బీమా పాలసీ తీసుకోవాల్సింది. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ టర్మ్‌ పాలసీని తీసుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ తర్వాత మీరు పెట్టుబడి గురించి ఆలోచించండి. మీరు ఇప్పటికే పొదుపు చేస్తున్న రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంపాటు దీన్ని కొనసాగించండి. మీరు సంపాదించే మొత్తంలో కనీసం 20 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. ఆ విధంగా ప్రణాళికను రచించుకోండి.

2) మా అబ్బాయి వయసు 15. ఉన్నత చదువుల కోసం తనను విదేశాలకు పంపించాలనేది ఆలోచన. ఇందుకోసం ఇప్పటి నుంచే నెలకు రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?  

హరికృష్ణ

మీ అబ్బాయిని విదేశాలకు పంపించాలనుకుంటున్నారు కాబట్టి, ఇప్పటి నుంచే దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టే మొత్తంలో 25 శాతం వరకూ అమెరికా మార్కెట్‌ ఆధారిత ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.30వేలను మంచి పనితీరున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. మీ అబ్బాయి చదువులకు డబ్బు అవసరమయ్యే మూడేళ్ల ముందు నుంచీ క్రమంగా ఈ పెట్టుబడులను సురక్షిత పథకాలకు మళ్లించాలి.

3) నాలుగేళ్ల క్రితం రూ.35 లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు మరో రూ.7 లక్షల వరకూ టాపప్‌ ఇస్తామంటూ బ్యాంకు చెబుతోంది. తీసుకోవచ్చా? ఏ పథకాల్లో మదుపు చేస్తే మంచి రాబడి వస్తుంది.

శ్రీధర్‌

ముందుగా ఇప్పటికే తీసుకున్న గృహరుణంపై లోన్‌ కవర్‌ ప్రొటెక్షన్‌ పాలసీని తీసుకోండి. ఎప్పుడూ పెట్టుబడులు సొంత డబ్బుతోనే ఉండాలి. అప్పు చేసి, మదుపు చేయడం సరికాదు. రూ.7 లక్షలు రుణం తీసుకుంటే దానికి వడ్డీ భారం ఉంటుంది. వడ్డీ 8 శాతం ఉంటుందనుకున్నా.. పెట్టుబడుల నుంచి అంతకు మించి ఆర్జించాలి. దీనికి బదులుగా మీ దగ్గర ఉన్న మిగులు మొత్తాన్నే మదుపు చేసేందుకు ప్రయత్నించండి.

4) మూడేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెట్టుబడులపై 13 శాతం వరకూ రాబడి కనిపిస్తోంది. కొన్ని ఇతర పథకాలు 21 శాతం వరకూ రాబడి ఇస్తున్నట్లు చూస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పథకాలు వాటిలోకి మార్చుకోవచ్చా?

దేవేందర్‌

గత ఏడాదిన్నర కాలంగా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల పనితీరు బాగుంది. ఈ పథకాల్లో పెట్టుబడులకు అధిక రాబడులు కనిపించాయి. అదే సమయంలో వీటిలో నష్టభయమూ ఎక్కువగానే ఉంటుంది. మీ పెట్టుబడిలో 20-30 శాతం వరకూ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్లు ఉండేలా చూసుకోండి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందులు రావచ్చు. 13 శాతం మంచి రాబడే అని చెప్పొచ్చు. మీ పథకాలను మరోసారి సమీక్షించుకొని, అవసరాన్ని బట్టి, మార్పులు చేసుకోండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని