పసిడిలో మదుపు ఎలా?

మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి?

Updated : 06 Dec 2023 14:33 IST

* మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి?
 ప్రతిభ
 మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తం డబ్బును ఒకే పథకానికి కేటాయించడం సరికాదు. మీ అమ్మాయి పెళ్లి, ఇతర అవసరాలకు ఎంత మేరకు బంగారం కావాలన్నది ముందు అంచనా వేసుకోండి. దానికి తగ్గట్లుగా బంగారంపై పెట్టుబడి పెట్టండి. ఇందుకోసం గోల్డ్‌ ఈటీఎఫ్‌ లేదా గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఈటీఎఫ్‌లో మదుపు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. వీలైతే సగం డబ్బును బంగారంలోనూ, మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.


* నేను మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.10వేలు మదుపు చేస్తున్నాను. కొత్తగా మరో రూ.8వేలు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఏం చేయాలి?

 విజయ్‌
మీరు అదనంగా మదుపు చేయాలనుకుంటున్న మొత్తం అయిదేళ్ల వరకూ అవసరం లేకపోతే ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఇప్పటి వరకూ మీరు పెట్టుబడి పెడుతున్న ఫండ్ల పనితీరు బాగుంటే ఈ కొత్త పెట్టుబడినీ వాటికే మళ్లించండి. లేదా ఒకటి రెండు కొత్త ఫండ్లను ఎంచుకోండి. మీ దగ్గర కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధి ఉండేలా చూసుకోండి. మూడేళ్ల లోపు డబ్బు అవసరం ఉందనుకుంటే.. రికరింగ్‌ డిపాజిట్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి.


* నాలుగేళ్ల తర్వాత ఇల్లు కొనాలన్నది కోరిక. ఇందుకోసం ఇప్పటి నుంచి నెలకు రూ. 30వేలు మదుపు చేద్దామని అనుకుంటున్నాం. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?
చందు
 మీకు నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.30వేలలో రూ.20వేల రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోండి. మిగతా రూ.10వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రీడ్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల కాస్త నష్టభయం ఉంటుంది. కానీ, రాబడి కొద్దిగా అధికంగా రావచ్చు. ఇంటి రుణం తీసుకున్నప్పుడు లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు.


* వచ్చే ఏడాది పదవీ విరమణ చేయబోతున్నాను. దీనికోసం ఇప్పటి నుంచే ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి. పెట్టుబడి సురక్షితంగా ఉండి, నెలకు రూ.30వేల వరకూ పింఛను వచ్చేలా చూసుకోవాలంటే ఎంత మొత్తం అవసరం అవుతుంది?
 సత్యనారాయణ
 ముందుగా మీరు సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. మీ పదవీ విరమణ గురించి మానసికంగా సిద్ధమవండి. ఇప్పుడు మీకు నెలకు ఎంత ఖర్చవుతోంది, పదవీ విరమణ తర్వాత ఎంత మొత్తం కావాలి అనే అంచనాలు వేసుకోండి. మీరు అనుకుంటున్న రూ.30వేలు సరిపోతాయా చూసుకోండి. పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను బహుమతులుగా ఇవ్వకండి. మీకు నెలకు రూ.30వేలు కావాలంటే 7 శాతం రాబడితో కనీసం రూ.51.50లక్షలు ఉండాలి. ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. వచ్చే ఏడాది కాస్త తగ్గే అంచనాలున్నాయి.


* మా అబ్బాయి వయసు 13. తన భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగపడేలా ఏడాదికోసారి రూ.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఈ డబ్బును ఏం చేయాలి?

రవీందర్‌
ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. ఏడాదికోసారి రూ.5లక్షలు కాకుండా, నెలనెలా రూ.42 వేల చొప్పున డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం మంచిది.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని