విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా...

నా వయసు 45. వార్షిక వేతనం  రూ.12లక్షలు. నాకు రూ.50 లక్షల ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

Updated : 15 Dec 2023 02:41 IST

నా వయసు 45. వార్షిక వేతనం  రూ.12లక్షలు. నాకు రూ.50 లక్షల ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?  

రామకృష్ణ

వార్షిక వేతనానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండాలి. మీకు ఇప్పటికే రూ.50లక్షల వరకూ టర్మ్‌ పాలసీ ఉంది. దీనికి అదనంగా మరో రూ.50 లక్షల పాలసీని తీసుకోవచ్చు. వార్షిక వేతనం రూ.12 లక్షల వరకూ ఉంది కాబట్టి, బీమా సంస్థలు అదనపు బీమా పాలసీకి ఎలాంటి అభ్యంతరాలూ పెట్టకపోవచ్చు. మీరు కొత్త పాలసీని వేరే కంపెనీ నుంచి తీసుకునే ప్రయత్నం చేయండి. మీ పాత పాలసీ వివరాలను దరఖాస్తు పత్రంలో కచ్చితంగా తెలియజేయండి. నెలకు రూ.15వేల పెట్టుబడి కోసం హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. మొత్తం పెట్టుబడిలో 25 శాతం వరకూ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్లకు కేటాయించండి. ఇలా క్రమం తప్పకుండా 13 ఏళ్లపాటు నెలకు రూ.15వేల చొప్పున మదుపు చేస్తూ వెళ్తే, సగటున 11 శాతం వార్షిక రాబడితో రూ.52,37,085 జమయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోండి.


 - మాకు ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం 8, 5 తరగతుల్లో ఉన్నారు. వారి భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. ఇందుకోసం ఏం చేయాలి?      

మహేందర్‌

  ముందుగా మీ పిల్లల ఆర్థిక భద్రత కోసం మీ పేరుపై తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేలా చూసుకోవాలి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మీకు డబ్బు అవసరం అయిన మూడేళ్ల ముందు నుంచి సురక్షిత పథకాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించాలి.


- నా వయసు 29. ఇటీవలే వివాహం అయ్యింది. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలూ తీసుకోలేదు. మేమిద్దరమూ ఉద్యోగులమే. ఎలాంటి పాలసీలు తీసుకోవాలి?      

వరుణ్‌
 మీ ఇద్దరూ విడివిడిగా జీవిత బీమా పాలసీలు తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ పాలసీ విలువ ఉండాలి. దీనికోసం టర్మ్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. ఒకే కంపెనీ నుంచి కాకుండా, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థల నుంచి ఈ పాలసీని తీసుకోండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద, ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోండి.
తుమ్మ బాల్‌రాజ్‌


- రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి టాపప్‌ ఇస్తామంటూ ఫోన్లు వస్తున్నాయి. దీన్ని తీసుకొని, మార్కెట్లో మదుపు చేయాలనేది ఆలోచన. ఇది మంచి పద్ధతేనా?          

సుధీర్‌
ఏడాది కాలంగా స్టాక్‌ మార్కెట్‌ అధిక రాబడులను అందించింది. దీన్ని చూసి, చాలామంది స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయాలనే ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో లాభాలు మాత్రమే కాదు.. నష్టాలూ అధికంగానే వస్తాయి. దీన్ని ముందుగా గుర్తించాలి. మీరు వాహన రుణంపై టాపప్‌ తీసుకుంటే.. కనీసం 12-13 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కాబట్టి, మీకు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మీరు టాపప్‌ రుణం తీసుకుంటే.. చెల్లించే ఈఎంఐని పెట్టుబడిగా పెట్టండి. దీనివల్ల మీపై అప్పు భారమూ ఉండదు. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకుండా, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేస్తే మంచిది.


ఆరు నెలల క్రితం ప్రమాదంలో కాలు విరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఇప్పటి వరకూ నాకు ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీలు లేవు. మధుమేహం ఉంది. ఇప్పుడు నేను పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? ఎంత మొత్తానికి తీసుకుంటే మంచిది?    

రాజేందర్‌
 ప్రమాదం నుంచి కోలుకున్నారు కాబట్టి, ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ప్రమాదం, మధుమేహం విషయాలను బీమా సంస్థకు తెలియజేయండి. పూర్తి వివరాలను పరిశీలించాకే బీమా సంస్థ మీకు పాలసీని జారీ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షలనూ కోరవచ్చు. సాధారణ ప్రీమియానికి కొంత లోడింగ్‌ ఉంటుంది. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థను సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని