లాభాల నుంచి నష్టాల్లోకి

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలతో విద్యుత్, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

Updated : 19 May 2022 02:45 IST

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలతో విద్యుత్, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల గరిష్ఠానికి చేరడం, విదేశీ మదుపర్ల అమ్మకాలు, ముడిచమురు ధరలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రూపాయి 17 పైసలు కోల్పోయి 77.61 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్‌ ఉదయం 54,554.89 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అనంతరం అదే ధోరణి కొనసాగిస్తూ, ఒకదశలో 54,786 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. తదుపరి మదుపర్ల అమ్మకాలతో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, ఇంట్రాడేలో 54,130.89 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 109.94 పాయింట్ల నష్టంతో 54,208.53 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 19 పాయింట్లు తగ్గి 16,240.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,211.20- 16,399.80 పాయింట్ల మధ్య కదలాడింది.

* ఎల్‌ఐసీ షేరు రెండో రోజూ స్తబ్దుగా ట్రేడైంది. ఇంట్రాడేలో రూ.890 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు మంగళవారం ధర రూ.875.45తో పోలిస్తే 0.09 శాతం పెరిగి రూ.876.25 వద్ద ముగిసింది.

* పతంజలి ఆయుర్వేద్‌ ఆహార రిటైల్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్న రుచి సోయా షేరు 9.59 శాతం పరుగులు తీసి రూ.1186.85 వద్ద ముగిసింది. 

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ 4.55%, టెక్‌ మహీంద్రా 2.14%, ఎస్‌బీఐ 2.01%, ఎల్‌ అండ్‌ టీ 1.92%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.66%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.63%, ఎన్‌టీపీసీ 1.46%, విప్రో 1.14% చొప్పున తగ్గాయి. హెచ్‌యూఎల్‌ 2.02%, అల్ట్రాటెక్‌ 2.01%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.65%, సన్‌ఫార్మా 0.82%, ఐటీసీ 0.72% లాభపడ్డాయి. 

అమెరికా, ఐరోపా మార్కెట్లు విలవిల: అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా డోజోన్స్‌ సూచీ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో 1100 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ సూచీ 540 పాయింట్లు పతనమైంది. బ్రిటన్‌ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో ఐరోపా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. గురువారం మన ట్రేడింగ్‌పై ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని