అరబిందోకు సెబీ హెచ్చరిక లేఖ

ఫార్మాకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. హైదరాబాద్‌ సమీపంలో అరబిందో ఫార్మాకు చెందిన ఒక యూనిట్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీ చేస్తున్న విషయాన్ని, దానిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన

Published : 28 Jun 2022 03:04 IST

యూఎస్‌ఎఫ్‌డీఏ ఆడిట్‌ సమాచారాన్ని పూర్తిగా వెల్లడించలేదని ఆగ్రహం

ఈ వ్యవహారాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నట్లు స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: అరబిందో ఫార్మాకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. హైదరాబాద్‌ సమీపంలో అరబిందో ఫార్మాకు చెందిన ఒక యూనిట్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీ చేస్తున్న విషయాన్ని, దానిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశాన్ని వెల్లడించలేదనే కారణంతో ఈ నెల 24న హెచ్చరిక లేఖను పంపింది. ‘కేవలం కొన్ని విషయాలు, పరిమితమైన సమాచారాన్ని మాత్రమే బయటపెట్టారు’ అని అందులో సెబీ స్పష్టం చేసింది. యూఎస్‌ఎఫ్‌డీఏ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఎందుకు తీవ్రమైనవిగా పరిగణించలేదని ప్రశ్నించింది. తన యూనిట్‌-1ను యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీ చేసి, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు, ఆఫిషియల్‌ యాక్షన్‌ ఇనీషియేటెడ్‌ (ఓఏఐ) అనే నోటీసు ఇచ్చినట్లు గత ఏడాది నవంబరు 10న అరబిందో ఫార్మా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దాని కారణంగా, ఈ యూనిట్‌ నుంచి యూఎస్‌ మార్కెట్‌కు మందుల సరఫరాపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 14న  ఇదే యూనిట్‌కు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ‘వార్నింగ్‌ లెటర్‌’ అందినట్లు అరబిందో ఫార్మా తెలియజేసింది. దీని ప్రకారం చూస్తే, సరైన సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదని స్పష్టమవుతున్నట్లు సెబీ అభిప్రాయపడింది. యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను తీవ్రమైనవిగా పరిగణించలేదని అరబిందో ఫార్మా వివరించడాన్ని సెబీ తప్పుపట్టింది. ఒకపక్క యూఎస్‌ఎఫ్‌డీఏ వెబ్‌సైట్లో ‘వార్నింగ్‌ లెటర్‌’, తనిఖీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉండగా, అరబిందో ఫార్మా మాత్రం పరిమిత సమాచారాన్ని మాత్రమే వెల్లడించిందని సెబీ పేర్కొంది. ఇది సరికాదని, స్టాక్‌  ఎక్స్ఛేంజీ లిస్టింగ్‌ నిబంధనలకు విరుద్ధమని సెబీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నట్లు, ఇకపై అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలపై ఉపేక్షించబోమని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి డైరెక్టర్ల బోర్డు సమావేశంలో చర్చించి, ఆ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని