Narayana Murthy: ఆమెను ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచి తప్పుచేశా: నారాయణ మూర్తి

Narayana Murthy: తన భార్య సుధామూర్తిని ఇన్ఫోసిస్‌ కంపెనీకి దూరంగా ఉంచి పొరబాటు చేశానని సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. ఆ రోజుల్లో తాను తప్పుగా ఆలోచించానని తెలిపారు.

Updated : 05 Jan 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నారాయణ మూర్తి (Narayana Murthy).. మరో ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌తో కలిసి ‘ఇన్ఫోసిస్‌ (Infosys)’ను ప్రారంభించారు. అయితే ఈ కంపెనీలో తన భార్య సుధామూర్తి (Sudha Murty)ని ఎందుకు చేర్చుకోలేదో తాజాగా ఆయన బయటపెట్టారు. ఆ రోజుల్లో తాను చాలా తప్పుగా ఆలోచించానని అన్నారు. కంపెనీలో చేరేందుకు తమకంటే ఆమెకే ఎక్కువ అర్హతలున్నాయని తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘కుటుంబాన్ని కంపెనీలోకి తీసుకురాకుంటేనే మంచి కార్పొరేట్‌ పాలన చేయగలమని నేను భావించా. ఎందుకంటే ఆ రోజుల్లో కంపెనీలోకి వారసులు వచ్చి యాజమాన్య బాధ్యతలు చేపట్టేవారు. దీంతో చట్టాల ఉల్లంఘన ఎక్కువగా జరిగేదని అనుకున్నా. కానీ, కొన్నేళ్ల క్రితం కొంతమంది ఫిలాసఫీ ప్రొఫెసర్స్‌తో నేను మాట్లాడినప్పుడు నా ఆలోచన తప్పని అర్థమైంది. ఓ వ్యక్తికి సరైన అర్హతలున్నప్పుడు.. అది మన భార్య లేదా పిల్లలు అయినా సరే వారిని కంపెనీలోకి తీసుకోకుండా అడ్డుకునే హక్కు మనకు లేదని తెలిసొచ్చింది. అలా చేస్తే వారి హక్కులను లాగేసుకోవడమే అవుతుందని వారు చెప్పారు’’ అని నారాయణమూర్తి అన్నారు. అప్పటి పరిస్థితులకు ప్రభావితమై తాను సుధామూర్తిని ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తాను చేసింది తప్పేనని అంగీకరించారు.

ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధామూర్తి ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘‘కంపెనీలో చేరొద్దని నా భర్త కోరారు. కుటుంబం మంచి కోసం నేను వెనక్కి తగ్గా. అప్పుడు దానికి నా మెదడు అంగీకరించినా.. మనసు మాత్రం ఒప్పుకోలేదు’’ అని తెలిపారు. ఇన్ఫోసిస్‌ ప్రారంభించేందుకు తన భార్యే రూ.10వేల పెట్టుబడి పెట్టారని నారాయణమూర్తి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

70 గంటల పని విధానంపై..

ఈ సందర్భంగా వారానికి 70 పనిగంటలపై తాను చేసిన వ్యాఖ్యలను నారాయణమూర్తి మరోసారి సమర్థించుకున్నారు. ‘రైతులు, కార్మికులు ఎంతో కష్టపడతారు. వారితో పాటు మనం కూడా చాలా శ్రమించాలి. సబ్సిడీ ద్వారా విద్యను అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మనలాంటి వారు భారీ రాయితీతో విద్యను పొందుతున్నారు కాబట్టి అందరూ చాలా కష్టపడి పనిచేయాలి. చైనా లాంటి ప్రపంచ ఆర్థిక శక్తులతో పోటీ పడాలంటే భారత్‌కు ఇలాంటి అంకితభావం అవసరం’ అని ఆయన అన్నారు. వారానికి 70 పనిగంటలపై తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ.. చాలా మంది తనతో ఏకీభవించారని నారాయణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో ఉండే నా స్నేహితులు, చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు నాకు ఫోన్‌ చేసి.. నా వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని