Service Charge: రెస్టారెంట్లు సర్వీసు ఛార్జ్‌ వసూలు చేస్తున్నాయా? ఈ నెంబరుకు ఫిర్యాదు చేయండి

ఒకవేళ ఎవరైనా రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జ్‌ వసూలు చేస్తే ఈ నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు....

Published : 05 Jul 2022 17:47 IST

దిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై సర్వీసు ఛార్జ్‌ (Service Charge) వసూలు చేయడానికి వీల్లేదు. సేవా రుసుము వసూలు (Service Charge) చేయడంపై నిషేధం విధిస్తూ కేంద్ర ‘వినియోగదారు హక్కుల పరిరక్షణ సంస్థ (CCPA)’ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అలా కాదని ఎవరైనా బలవంతంగా సేవా రుసుము విధిస్తే.. దానిని బిల్లులో నుంచి తొలగించమని వినియోగదారులు అడగొచ్చు. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు కూడా చేసేందుకు అవకాశం కల్పించింది.

🍴 ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్‌ సేవా రుసుము విధిస్తే 1915కు కాల్‌ చేసి లేదంటే లేదా ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

🍴 ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఇ-డాఖిల్‌ పోర్టల్‌ (https://www.edaakhil.nic.in/) ద్వారా వినియోగదారుల కమిషన్‌ వద్ద కూడా ఫిర్యాదులు దాఖలు చేయొచ్చు.

🍴 ఇలాంటి వ్యవహారాలపై దర్యాప్తు జరపాల్సిందిగా సంబంధిత కలెక్టరునూ కోరవచ్చు. సీసీపీఐకు ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు పంపించవచ్చు.

ఆహార పదార్థాల బిల్లుపై అదనంగా 10 శాతం సేవా రుసుము కలిపి, ఈ మొత్తంపై జీఎస్‌టీ (వస్తు సేవా పన్ను) వసూలు చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో.. ‘అనైతిక వ్యాపార విధానాలు, వినియోగదారు హక్కుల ఉల్లంఘన’ను నియంత్రించేందుకు సీసీపీఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. ఏ రెస్టారెంటు లేదా హోటల్‌ తమ ఆహార పదార్థాల బిల్లులో సేవా రుసుమును కలపకూడదు. ఇతరత్రా ఏ పేరుతోనూ ఈ రుసుము వసూలు చేయకూడదు. వినియోగదారులను సేవా రుసుము కట్టమని ఒత్తిడి చేయకూడదు. బిల్లులో సేవా రుసుము కలిపి, ఆ మొత్తానికి జీఎస్‌టీ విధించకూడదు. ‘సేవా రుసుము ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారు ఇష్టం. వారి విచక్షణపైనే అది ఆధారపడి ఉంటుంద’ని తాజా మార్శదర్గకాలు స్పష్టం చేస్తున్నాయి.

టిప్‌ ఇవ్వాలా? వద్దా? వినియోగదారుల ఇష్టం..

‘ఒక వస్తువు విక్రయ ధరలో వస్తువు, సేవల విభాగం రెండూ కలిసే ఉంటాయి. ఫలానా ఆహార పదార్థం లేదంటే పానీయానికి ధర నిర్ణయించే విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందువల్ల మెనూలో పొందుపర్చిన ఆహార పదార్థాలకు ఆర్డరు ఇచ్చినప్పుడు దాని ధర, వర్తించే పన్నులు కలిసే ఉంటాయి. అంతకుమించి అదనంగా వసూలు చేస్తే అది అనైతిక వ్యాపార విధానం కిందకు వస్తుంద’ని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఆహార పదార్థాలను తిన్న తర్వాత.. దాని నాణ్యత, హోటల్‌ సిబ్బంది అందించిన సేవల ఆధారంగా టిప్‌ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై వినియోగదారు నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. అందువల్ల సేవా రుసుమును బిల్లులో కలపడం వినియోగదారు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని