Infosys Q2 Results: ఇన్ఫోసిస్‌ లాభం రూ.6,215 కోట్లు.. 3.1 శాతం వృద్ధి

Infosys Q2 Results: అస్థిర ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇన్ఫోసిస్‌కు బలమైన ఆర్డర్లు లభించాయని సంస్థ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు.

Published : 12 Oct 2023 18:07 IST

దిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys Q2 Results) జులై- సెప్టెంబరు త్రైమాసికంలో రూ.6,215 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.6,026 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం అధికం. ఇదే సమయంలో ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ.38,994 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను 1- 2.5 శాతానికి ఇన్ఫోసిస్‌ కుదించింది. అంతకుముందు 1- 3.5 శాతం ఆదాయ వృద్ధిని సంస్థ అంచనా వేసింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఇన్ఫోసిస్‌ రూ.18 మధ్యంతర డివిడెండ్‌ (Infosys interim dividend)ను ప్రకటించింది. దీనికి 2023 అక్టోబర్‌ 15ను రికార్డు తేదీగా నిర్ణయించింది.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.7.7 బిలియన్‌ డారల్లు విలువ చేసే భారీ ఆర్డర్లు లభించినట్లు ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వెల్లడించారు. అస్థిర స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ ఈ స్థాయి ఆర్డర్లు రావడం తమ సంస్థ సామర్థ్యాన్ని సూచిస్తోందన్నారు. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా తమ సంస్థ రూపుదిద్దుకుంటోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. స్థిర కరెన్సీ రూపేణా ఏడాదిక్రితంతో పోలిస్తే 2.5 శాతం వృద్ధిని ఇన్ఫోసిస్‌ నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 2.3 శాతంగా నమోదైంది. కంపెనీ షేరు ఈరోజు 2.82 శాతం కుంగి రూ.1,452 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని