GDP: 2024 భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన మూడీస్‌

GDP: గత ఏడాది ఊహించిన దానికంటే బలమైన ఆర్థిక కార్యకలాపాలు నమోదైన నేపథ్యంలో ఈ కేలండర్‌ ఏడాది వృద్ధి అంచనాలను పెంచుతున్నట్లు మూడీస్‌ తెలిపింది.

Updated : 04 Mar 2024 14:04 IST

దిల్లీ: భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ పెంచింది. గతంలో 6.1 శాతంగా ఉన్న అంచనాను తాజాగా 6.8 శాతానికి సవరించింది. 2023లో ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికన్నా బలంగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. అలాగే అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల ప్రభావమూ క్రమంగా క్షీణిస్తున్నట్లు వెల్లడించింది.

భారత వాస్తవిక జీడీపీలో వార్షిక ప్రాతిపదికన 2023 కేలండర్ ఏడాది చివరి మూడు నెలల్లో 8.4 శాతం వృద్ధి నమోదైంది. ఫలితంగా గత ఏడాది మొత్తం వృద్ధిరేటు 7.7 శాతానికి చేరింది. ప్రభుత్వ మూలధన వ్యయం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవటం 2023 ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచినట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందని చెప్పింది. 2025లో జీడీపీ వృద్ధి అంచనాలను 6.4 శాతంగా పేర్కొంది.

సెప్టెంబరు, డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన బలమైన ఆర్థిక వృద్ధి జోరు మార్చితో ముగియనున్న మూడు నెలల వ్యవధిలోనూ కొనసాగుతోందని మూడీస్‌ తెలిపింది. బలమైన జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాలు పుంజుకోవటం, రుణ మంజూరులో రెండంకెల వృద్ధి వంటి అంశాలు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ పటిష్ఠంగా ఉన్నట్లు సూచిస్తున్నాయని తెలిపింది. తయారీ, సేవల కార్యకలాపాల విస్తరణ సరఫరా దిశగా ఉన్న సానుకూలతలను తెలియజేస్తున్నాయని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఇవే విధానాలు కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి ఇలాగే కొనసాగిస్తారని పేర్కొంది.

భారత్‌ సహా వివిధ దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భౌగోళిక రాజకీయాలు రాబోయే కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ వాణిజ్యం, మూలధన ప్రవాహం, వలసల వంటి అంశాలను ప్రభావితం చేస్తాయని మూడీస్‌ తెలిపింది. పలు దేశాల అంతర్గత పరిశ్రమ, వ్యాపార పాలసీలు విదేశాంగ విధానాలతో ముడిపడి ఉన్నాయని గుర్తుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని