Expensive City: ప్రపంచంలో ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్‌

Expensive City: వినియోగ వస్తువులు, సేవల ధరలు, అద్దెలను ఆధారంగా చేసుకొని ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఈసీఏ ఇంటర్నేషనల్‌ రూపొందించింది.

Updated : 07 Jun 2023 15:02 IST

వాషింగ్టన్‌: ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా (Expensive City) న్యూయార్క్‌ (New York) నిలిచింది. గతంలో ఈ స్థానంలో ఉన్న హాంకాంగ్‌ (Hong Kong) ఇప్పుడు ద్వితీయ స్థానానికి చేరింది. మరోవైపు అద్దెలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్‌ ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లోకి ఎగబాకింది.

అధిక ద్రవ్యోల్బణం, అద్దెలు పెరగడమే న్యూయార్క్‌ (New York)లో ప్రవాసులు నివసించడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని ‘ఈసీఏ ఇంటర్నేషనల్స్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ 2023’ నివేదిక తెలిపింది. జెనీవా, లండన్‌ ఈ జాబితాలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న సింగపూర్‌ ఈసారి ఏకంగా తొలి ఐదు నగరాల జాబితాలోకి ఎగబాకడం గమనార్హం. సాధారణంగా ఆసియా నగరాలు ఈ జాబితాలో కిందకు వెళుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడమే దీనికి కారణం. కానీ, ఈసారి ట్రెండ్‌కు భిన్నంగా సింగపూర్‌ పైకి ఎగబాకింది.

ఈ జాబితాలో ఇస్తాంబుల్‌ ఏకంగా 95 స్థానాలు పైకి ఎగబాకి 108వ స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఆర్థిక విధానాల వల్ల ఇటీవల టర్కీలో ధరలు 80 శాతం పెరిగాయి. ఇదే ఇస్తాంబుల్‌ తక్కువ సమయంలో ఖరీదైన నగరంగా మారడానికి దోహదం చేసింది. వినియోగ వస్తువులు, సేవల ధరలు, అద్దెలను ఆధారంగా చేసుకొని ఈసీఏ ఇంటర్నేషనల్‌ ఈ జాబితాను సిద్ధంగా చేస్తుంది. 120 దేశాల్లోని మొత్తం 207 నగరాలకు ర్యాంకులను కేటాయిస్తోంది.

  • రష్యా నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో అద్దెలు దాదాపు 33 శాతం పెరిగాయి. దీంతో ఈ నగరం జాబితాలో 12వ స్థానంలో నిలిచింది.
  • ఐరోపాకు చెందిన చాలా నగరాలు ఈ జాబితాలో పైకి ఎగబాకాయి. కానీ, నార్వే, స్వీడన్‌ సిటీలు మాత్రం బలహీన కరెన్సీల కారణంగా కిందకు దిగజారాయి. తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా ఫ్రాన్స్‌ నగరాలు సైతం ఖరీదైన నగరాల జాబితాలో కిందకు వెళ్లాయి.
  • బలహీన కరెన్సీ, తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా చైనా నగరాలు సైతం ప్రవాసులు నివసించడానికి ఖరీదు విషయంలో అనువుగా మారాయి.
  • అమెరికాలోని దాదాపు అన్ని నగరాలు పైకి ఎగబాకాయి. బలమైన డాలర్‌, అధిక ద్రవ్యోల్బణమే దీనికి కారణం. శాన్‌ఫ్రాన్సిస్కో ఈసారి తొలి 10 నగరాల జాబితాలో చేరింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని