Q-A: ELSSలో సిప్ చేయడం మంచిదేనా?

ఈఎల్ఎస్ఎస్లో మదుపు చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఇందులో సిప్ చేస్తే 3 ఏళ్ళ లోక్ ఇన్ ఉంటుంది.

Updated : 14 Nov 2022 18:45 IST

నా వయసు 27. రెండేళ్లుగా ప్రతి నెలా రూ. 7000 ELSS (axis long term equity direct, Aditya Birla sunlife tax relief 96 direct, mirae asset tax saver fund)లో మదుపు చేస్తున్నాను. ఇప్పుడు రూ.9000కు పెంచి పొదుపు చేద్దాం అనుకుంటున్నా. ఉన్నవాటిని కొనసాగించాలా? లేదా వేరేవి ఎంచుకోవాలా?

- కృష్ణ కుమార్

పన్ను ఆదా ఫండ్లలో సిప్ చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతి సిప్‌కు 3 ఏళ్ల లాక్-ఇన్ ఉంటుంది. అంటే, మీరు 3 ఏళ్ల పాటు సిప్ చేసినట్టయితే, లాక్-ఇన్ పూర్తయ్యి మీ పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకోవాలంటే 6 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి, ఈఎల్ఎస్ఎస్‌లో సిప్ బదులు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం మేలు. లాక్-ఇన్ పూర్తయ్యాక మీరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఎంచుకోవచ్చు. పన్ను ఆదా కోసం మీరు పీపీఎఫ్, ఎన్‌పీఎస్ లాంటివి కూడా ఎంచుకోవచ్చు. 

దీర్ఘకాలం మదుపు కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.


నేను 3 ఏళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నా. ప్రస్తుతానికి రూ. 46 లక్షల వరకు ఉంది. నేను ఇంటిని రూ. 80 లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. పన్ను చెల్లించాల్సి ఉంటుందా?


- దిలీప్ కుమార్

మీరు దీర్ఘకాల మూలధన లాభంపై (ఇండెక్షేషన్‌తో) 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ధరకి, అమ్మిన ధరకి మధ్య వ్యత్యాసమే దీర్ఘకాల మూలధన ఆదాయం. అయితే, మీరు ఇల్లు అమ్మిన తేదీ నుంచి రెండేళ్లలోపు మరో ఇంటిని కొనుగోలు చేసినా లేక మూడేళ్లలోపు మరో ఇంటి నిర్మాణం పూర్తి చేసినా.. దీర్ఘకాల మూలధన పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. 


నా వయసు 69. నేను రూ. 1 కోటి బీమా హామీతో జీవిత బీమా తీసుకోవాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి. 

- పీవీ చలపతి రావు

జీవిత బీమా అనేది కుటుంబంలో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి (నామినీ) ఒకేసారి బీమా మొత్తం అందిస్తారు. మీరు ఉద్యోగస్తులు కాకపోతే జీవిత బీమా అవసరం లేదు. మీ కుటుంబంలో ఎవరైనా మీ మీద ఆధార పడితే తీసుకోవచ్చు. లేదా మీ కుటుంబంలో అధిక సంపాదన కలిగిన వారు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. వారు మిమ్మల్ని నామినీ పెట్టడం వల్ల మీకు రక్షణ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని