Byjus: బైజూస్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లే.. బ్లాక్‌రాక్‌ అంచనా!

Byjus: బైజూస్‌లో తమకున్న వాటాల విలువను లెక్కగడుతూ ఆ సంస్థ విలువను బ్లాక్‌రాక్‌ పెద్ద ఎత్తున కుదించింది.

Updated : 12 Jan 2024 14:03 IST

బెంగళూరు: దేశీయ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ (Byju's) విలువను ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ బ్లాక్‌రాక్‌ గణనీయంగా తగ్గించి 1 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. బైజూస్‌లో తమకున్న వాటాలను లెక్కగడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘టెక్‌క్రంచ్‌’ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. 

బైజూస్‌ (Byju's) అంచనా విలువను బ్లాక్‌రాక్‌ కుదించడం ఇది తొలిసారేమీ కాదు. గత ఏడాది మార్చి త్రైమాసికంలో సంస్థ విలువను 8.4 బిలియన్‌ డాలర్లకు కుదిస్తున్నట్లు అమెరికా ఎస్‌ఈసీకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు 2022 డిసెంబర్‌లో 11.5 బిలియన్ డాలర్లకు తగ్గించింది. బైజూస్‌ ఒక్కో షేరు విలువను బ్లాక్‌రాక్‌ 2022 ఏప్రిల్‌లో 4,660 డాలర్లుగా అంచనా వేసింది. అదే ఏడాది డిసెంబర్ నాటికి దాన్ని 2,400 డాలర్లకు.. తాజాగా 210 డాలర్లకు కుదించింది. ఈ విషయంపై ఇప్పటి వరకు బ్లాక్‌రాక్‌గానీ, బైజూస్‌గానీ స్పందించలేదు.

బైజూస్‌ అంచనా విలువను బ్లాక్‌రాక్‌తో పాటు ఇతర ప్రముఖ సంస్థలు సైతం తగ్గిస్తూ వస్తున్నాయి. 2023 నవంబర్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ‘ప్రోసస్‌ ఎన్‌వీ’ ఈ ఎడ్‌టెక్‌ సంస్థ విలువను మూడు బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. బైజూస్‌లో ఈ కంపెనీకి 9.7 శాతం వాటాలున్నాయి. అంతకుముందు అమెరికాకు చెందిన బారన్‌ క్యాపిటల్‌ సైతం కంపెనీ విలువను 2023 జూన్‌ నాటికి 11.7 బిలియన్‌ డాలర్లుగా పేర్కొంది.

బైజూస్‌ (Byju's) 2022 మార్చిలో 800 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఆ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది. క్రమంగా ఆన్‌లైన్‌ పాఠాలకు ఆదరణ తగ్గడంతో కంపెనీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. లాభాలు వచ్చే పరిస్థితి కనిపించకపోవటంతో ఆయా సంస్థలు కంపెనీ విలువను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని