Crime news: 300 అడుగుల లోయలో పడిన వాహనం.. 11మంది దుర్మరణం!

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11  మంది దుర్మరణం చెందగా.. ముగ్గురు గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు.

Published : 18 Nov 2022 22:00 IST

దేహరాదూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11  మంది దుర్మరణం చెందగా.. ముగ్గురు గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 16 మందితో వెళ్తున్న సుమో.. జోషిమఠ్‌ ప్రాంతంలోని ఉర్గాం వద్దకు రాగానే  లోయలో పడిపోయినట్టు చమోలీ ఎస్పీ ప్రమేంద్ర డోభాల్‌ తెలిపారు. ప్రయాణికులు జోషీమఠ్‌ నుంచి పల్లజఖోల్‌ గ్రామం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు. ప్రమాద  సమయంలో వాహనంలో నుంచి ఇద్దరు కిందకు దూకేశారని తెలిపారు.  సమాచారం తెలియగానే పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు  చేపట్టాయని వివరించారు.  లోయ 300 అడుగుల లోతు ఉంటుందని..  ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించడం కష్టంగా  ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ వాహనంలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారని.. కొందరు సుమో పైకి ఎక్కి కూర్చున్నట్టు తెలుస్తోంది. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన..  రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని