Crime News: ఝార్ఖండ్‌లో విషాదం.. చెరువులో పడి ఏడుగురు అమ్మాయిలు మృతి

పండగ వేళ ఝార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. లాతేహార్‌ జిల్లాలోని బుక్రు గ్రామంలో శనివారం చెరువులో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు మృతి చెందారు. 

Published : 18 Sep 2021 23:15 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. లాతేహార్‌ జిల్లాలోని బుక్రు గ్రామంలో శనివారం చెరువులో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు మృతి చెందారు. రాష్ట్రంలో గిరిజనుల ప్రధాన పండుగ అయిన ‘కర్మ పూజ’లో భాగంగా శనివారం గ్రామానికి చెందిన 10 మంది అమ్మాయిలు పూజలు చేసిన చెట్టు కొమ్మను నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మొదటగా ఇద్దరు నీళ్లలో దిగారు. ఇంతలోనే వారు మునిగిపోతుండటం గమనించిన మిగతావారు వారిని రక్షించేందుకు యత్నించారు. ఒకరినొకరు కాపాడే యత్నంలో.. అందరూ మునిగిపోయారు. వారి ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, వారిని బయటకు తీశారు. అప్పటికే నలుగురు చనిపోగా, ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మిగతా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా 12 నుంచి 20 ఏళ్లలోపు వారేనని, వారిలో ముగ్గురు అక్కా చెల్లెళ్లని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సాయం అందిస్తామన్నారు. మరోవైపు గ్రామస్థులు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. సమీప జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని