సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టనున్న పోలీసులు

ఇటీవలీ కాలంలో.. రాష్ట్రంలో సైబర్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక నకిలీ ఫోన్‌ నంబర్లను ఉపయోగించి బహుమతులు, ఆఫర్లు అంటూ మోసం చేసే కేటుగాళ్ల సంగతి సరేసరి.

Published : 22 Oct 2020 23:41 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇటీవలి కాలంలో.. రాష్ట్రంలో సైబర్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక నకిలీ ఫోన్‌ నంబర్లను ఉపయోగించి బహుమతులు, ఆఫర్లు అంటూ మోసం చేసే కేటుగాళ్ల సంగతి సరేసరి. సైబర్‌ నేరాల గురించి ఎంత అవగాహన ఉన్నా చాలామంది వారి మాయలో పడుతూనే ఉంటారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మరో కొత్త విధానంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వారికి చెక్‌ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు సమాయత్తమవుతున్నారు. మోసాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ ఫోన్‌ నంబర్లు ఉపయోగించి మోసాలు చేస్తున్నవారికి చెక్‌ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌ కార్డులు తీసుకుని ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, ధ్రువపత్రాలు సరిగా లేకున్నా గంపగుత్తగా సిమ్‌ కార్డులను ఇస్తున్న మూడు నెట్‌వర్క్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు.

గత ఆరునెలల్లోనే నాలుగు రెట్లు అధికంగా... 
సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా హరియాణా, దిల్లీ, కోల్‌కతాలో నకిలీ ధ్రువప్రతాలు పెట్టి సిమ్‌కార్డులు తీసుకుంటారు. ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు వాహనాలు ఇతరత్రా వస్తువులు ఇస్తామంటూ, డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాకా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా సైనికాధికారుల ఫొటోలను, పేర్లను ఉపయోగిస్తోంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని నేరపరిశోధన సంయుక్త కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. ఓఎల్‌ఎక్స్‌ కంపెనీకీ తాఖీదులు పంపుతామని పోలీసులు వివరించారు. చిరునామా వివరాలు లేకుండా ప్రకటనలు జారీ చేస్తూ, నేరస్థులకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఈ కంపెనీ ప్రతినిధులకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని