Telugu Academy Scam: దుబాయి నుంచి చౌకగా డీజిల్‌ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చా

తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించి రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారన్న అంశాలను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. గోల్‌మాల్‌ సూత్రధారి సాయికుమార్‌ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్‌ సహకార క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌

Updated : 08 Oct 2021 09:44 IST

ఓఆర్‌ఆర్‌ వద్ద 35 ఎకరాలు కొన్నా
పోలీసులకు ‘తెలుగు అకాడమీ’ గోల్‌మాల్‌ సూత్రధారి సాయికుమార్‌ వెల్లడి
ఎఫ్‌డీల మాయాజాలంపై దర్యాప్తు చేయనున్న ఈడీ  
ఈనాడు - హైదరాబాద్‌

తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించి రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారన్న అంశాలను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. గోల్‌మాల్‌ సూత్రధారి సాయికుమార్‌ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్‌ సహకార క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే డీజిల్‌ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్టు సమాచారం. కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ఫ్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు డాక్టర్‌ వెంకట్‌ చెప్పినట్టు తెలిసింది. కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాష్‌ మహంతి చెప్పారు. తాజాగా ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.

కలర్‌ జిరాక్సుల పద్మనాభన్‌ అరెస్ట్‌..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కలర్‌ జిరాక్స్‌లు తీసి, వాటిని అకాడమీ అధికారులకు ఇచ్చిన చెన్నైవాసి పద్మనాభన్‌ను సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని ఓ హోటల్‌లో ఉండగా.. ఏసీపీ మనోజ్‌ కుమార్‌ బృందం అతడిని పట్టుకుంది.

బలమైన నెట్‌వర్క్‌... ఉమ్మడి కార్యాచరణ

ప్రభుత్వ శాఖల్లోని నిధులను వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించి వాటిని కొల్లగొట్టేందుకు సాయికుమార్‌ ఒక బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని సీసీఎస్‌ పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. పదేళ్ల క్రితం అతడికి నండూరి వెంకటరమణ(తణుకు, ఏపీ), రాజ్‌కుమార్‌(ధర్మవరం, ఏపీ)లు పరిచయమయ్యారు. మైనార్టీ కార్పొరేషన్‌, ఏపీ హౌసింగ్‌ బోర్డు, కాలుష్య నియంత్రణ మండలిలకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో సాయికుమార్‌కు వీరు వెన్నంటి ఉన్నారు. ఫలానా ప్రభుత్వ శాఖలో నిధులు కొట్టేద్దామని పథకం సిద్ధం చేసుకున్నాక అధికారులు, బ్యాంక్‌ మేనేజర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వారిని ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుని నిధులు కొట్టేద్దాం అంటూ ప్రణాళిక వివరిస్తారు. అనంతరం కొంతమంది వ్యక్తులను నియమించుకుని ఉమ్మడిగా పనులు పూర్తిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని