Crime News: ట్రీట్‌మెంట్‌ చేస్తుంటే.. వైద్యురాలిని చంపిన రోగి: కేరళలో దారుణం

కేరళలో బుధవారం దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. చికిత్స చేస్తోన్న వైద్యురాలు రోగి చేతిలో హత్యకు గురయ్యారు. (Doctor Stabbed to Death)

Updated : 10 May 2023 16:22 IST

తిరువనంతపురం: చికిత్స చేస్తూ రోగి చేతిలో ఓ యువ వైద్యురాలు దారుణహత్యకు గురయ్యారు. డ్రెస్సింగ్ చేస్తోన్న వైద్యురాలిపై ఆ వ్యక్తి ఒక్కసారిగా దాడిచేసి పొడిచి చంపేశాడు. కేరళ(Kerala)లోని కొట్టరక్కర ప్రాంతంలోని తాలుకా ఆసుప్రతిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Doctor Stabbed to Death)

కొట్టరక్కరలోని ఆసుపత్రిలో వైద్యురాలు వందనాదాస్(22) హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం మెడికల్‌ చెకప్‌లు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కాలి గాయంతో ఉన్న నిందితుడికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ట్రీట్‌మెంట్ సమయంలో అతడు ఉన్నట్టుండి ఆగ్రహానికి గురయ్యాడు. రెచ్చిపోయి అక్కడున్న వైద్య పరికరాలతో అందరిని భయభ్రాంతులకు గురిచేశాడు. దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో యువ వైద్యురాలిని పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబసభ్యులతో ఘర్షణపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాంతో ఈ దాడిలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. మరోపక్క దీనిపై భారత వైద్య మండలి(IMA) ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం ఉండదని తన ప్రకటనలో పేర్కొంది.

హైకోర్టు దిగ్భ్రాంతి.. ప్రభుత్వ వైఫల్యమంటూ ఆగ్రహం

వైద్యురాలి హత్యపై కేరళ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి ఈ కేసును అత్యవసరంగా విచారించింది. ‘ఇది పూర్తిగా వ్యవస్థ లోపం. ఒక వ్యక్తి అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు అతడిని అదుపులో ఉంచాలి. అనూహ్య ఘటనలు మీరు ఊహించగలగాలి. అలా లేనప్పుడు పోలీసుల అవసరం ఏముంది..? ఈ ఘటన వైద్యులు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఒక భయాన్ని సృష్టించింది. ఇప్పుడు వైద్యులు సమ్మెకు దిగారు. దీనివల్ల ఏ రోగికైనా ఏదైనా జరిగితే డాక్టర్లను నిందించగలమా..?’ అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు విభాగాన్ని గట్టిగా మందలించింది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ప్రస్తుతం అతడు సస్పెండ్‌ అయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు