Afghanistan: మసీదులో భారీ పేలుడు.. 46మంది మృతి!

తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ మరోసారి భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్‌ ప్రావిన్స్‌లో ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. శుక్రవారం ఖాన్‌ అబాద్‌ ప్రాంతంలోని.......

Updated : 09 Oct 2021 17:01 IST

కాబుల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ మరోసారి దాడులతో దద్దరిల్లింది. ఉత్తర అఫ్గానిస్థాన్‌ కుందుజ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలోని ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 46మంది వరకు దుర్మరణం చెందగా.. అనేకమంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఖాన్‌ అబాద్‌ ప్రాంతంలోని షియాల మసీదును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద శబ్దాలు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మారణకాండతో మసీదులో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది.

దీనిపై తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్‌ స్పందించారు. షియాల మసీదును లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. అనేక మంది గాయాలపాలైనట్టు తెలిపారు. తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో కూడా అనేకసార్లు షియాలపై ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లు దాడిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని