
Published : 29 Jan 2020 00:40 IST
గుర్రపు పందేల్లో అపశ్రుతి
విజయనగరం: విజయనగరం జిల్లా వేపాడలో జాతర సందర్భంగా నిర్వహించిన గుర్రపు పందేల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మరిడిమాంబ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుర్రపు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటీలు ప్రారంభం కాగానే జోరందుకున్న ఓ గుర్రం జనసందోహం పైకి దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికులు ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో శ్రీరాములు, వెంకినాయుడు గాయపడ్డారు. శ్రీరాములుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శృంగవరపుకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తలకి బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో శ్రీరాములు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
Tags :