బెంగాల్‌లో సీఏఏ ఆందోళన హింసాత్మకం

పౌరసత్వ వ్యతిరేక చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 30 Jan 2020 00:42 IST

ఇద్దరు మృతి

బహరంపుర్‌: పౌరసత్వ వ్యతిరేక చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ ‘నాగరిక్ మంచా’ అనే స్థానికుల బృందం జలంగీ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే బుధవారం సరస్వతి పూజ జరుగుతున్న నేపథ్యంలో దుకాణదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ బంద్‌ను వెనక్కి తీసుకోవాలంటూ స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి పరస్పరం బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. 

అయితే తాము ఎలాంటి హింసకు పాల్పడలేదని.. కాంగ్రెస్‌, సీపీఎం మద్దతుదారులే తమపై బాంబులతో దాడి చేశారని తృణమూల్‌ ఎంపీ అబు తాహీర్‌ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా.. తాహీర్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని