Crime News: నిందితులను పట్టించిన ‘రంగు’.. దారి దోపిడీ ముఠా అరెస్ట్‌

ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్న సంఘటనలో నిందితులను వారు వాడిన వాహనం రంగు ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

Updated : 30 May 2022 08:46 IST

ఎం.వి.పి.కాలనీ(విశాఖ), న్యూస్‌టుడే : ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్న సంఘటనలో నిందితులను వారు వాడిన వాహనం రంగు ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి ఏడీసీపీ (క్రైమ్‌) గంగాధరం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...

ఈ నెల 22వ తేదీ తెల్లవారుఝాము 3 గంటల సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావు శ్రీకాకుళం వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకోగా అప్పటికే బస్సులు వెళ్లిపోయాయి. దీంతో బయటకు వచ్చి ఫుట్‌పాత్‌పై నిలిచి ఉండగా.. మూడు వాహనాలపై ఏడుగురు యువకులు అటుగా వచ్చి రాజారావు వద్ద ఆపారు. రూ.500 కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాజారావు అక్కడ నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించగా, కత్తి చూపించి అతని జేబులో ఉన్న రూ.5500 లాక్కుని అక్కడి నుంచి వాహనాలపై రైల్వేస్టేషన్‌పై వైపు వెళ్లిపోయారు. రాజారావు డయల్‌ 100కు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

యువకులు తిరిగిన ప్రాంతాలను పరిశీలించి, ఆయా మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా యువకులు వాహనాలపై సుమారు 2 గంటల పాటు పరిసరాల్లోనే తిరిగినట్లుగా గుర్తించారు. వారి వాహనాలకు నెంబరు ప్లేటు ఉన్నా దాన్ని వంచేయటంతో కనిపించలేదు. దీంతో పోలీసులు ఆయా వాహనాల రంగులను పరిశీలించారు. వీటిపై నిఘా పెట్టారు. అడవివరం దరి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ రంగు వాహనాలపై వస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాన్ని చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ వాహనాలన్నీ కుటుంబసభ్యులవి కావటం గమనార్హం. వీరి నుంచి రూ.2500 నగదు, మూడు వాహనాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పి.అభినాష్, ప్రవీణ్‌కుమార్, అశోక్‌కుమార్, ఎల్‌.సతీష్‌లతో పాటు ముగ్గురు బాలలను అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని