Khammam: నిద్ర లేరా తమ్ముడూ అంటూనే అంతమొందించాడు

పండగ రోజు రెబ్బవరం గ్రామం ఉలిక్కిపడింది. సొంత అన్నే తమ్ముణ్ని కిరాతకంగా హత్య చేసిన ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపు నిందితుడు బహిరంగంగా..

Updated : 26 Oct 2022 09:37 IST

సోదరుణ్ని హత్య చేసిన అన్న


నరేశ్‌ (పాత చిత్రం)

వైరా, న్యూస్‌టుడే: పండగ రోజు రెబ్బవరం గ్రామం ఉలిక్కిపడింది. సొంత అన్నే తమ్ముణ్ని కిరాతకంగా హత్య చేసిన ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపు నిందితుడు బహిరంగంగా.. ‘ఈ హత్య నేనే చేశాను. నా భార్యతో అత్యంత సన్నిహితంగా ఉండటం కళ్లతో చూశాక ఎందుకు ఊరుకుంటానం’టూ జనం మధ్య చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో జరిగిన హత్యోదంతం పూర్తి వివరాలిలా ఉన్నాయి..

రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణ, సాదం నరేశ్‌(32) అన్నదమ్ములు. నరేశ్‌ గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. పలు రకాల పనులు చేస్తూ రామకృష్ణ గ్రామంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. వీరిద్దరూ ఒకే ఇంటి ఆవరణలో వేర్వేరు గదుల్లో ఉంటుంటారు. నరేశ్‌ భార్య రెండేళ్ల క్రితం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయి ఇక్కడకు రావడం లేదు. తన తల్లి సుబ్బమ్మతో కలిసి అతను ఉంటుండగా రామకృష్ణ తన భార్య, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. రెండు వారాల క్రితం ఇంటికి వచ్చేసరికి తన భార్య, తమ్ముడు నరేశ్‌ సన్నిహితంగా ఉండటాన్ని తాను చూశానంటూ రామకృష్ణ సన్నిహితులకు, ఇతరులకు తెలిపాడు. భార్యను అప్పటి నుంచి తీవ్రంగా కొడుతూ ఇద్దరిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. భయపడిన భార్య తన పుట్టిల్లైన రాజమండ్రికి పిల్లలను తీసుకొని పది రోజుల క్రితం వెళ్లింది. అప్పటినుంచి తమ్ముడు నరేశ్‌ కూడా అప్రమత్తంగా ఉంటున్నాడు. పుట్టింటికి వెళ్లిన తన భార్యను ఇక్కడకు పిలిపించాలని, బాగా చూసుకుంటానంటూ రామకృష్ణ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వచ్చేందుకు నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. తమ్ముణ్ని మచ్చిక చేసుకున్నాడు. మనిద్దరం మంచిగా ఉందామని చెప్పి మూడు నాలుగు రోజులుగా నరేశ్‌ పనిచేసే ప్లాంట్‌ వద్దకు వెళ్లి అతడి వద్ద ఖర్చులకు నగదు తీసుకొంటున్నాడు. ఈ నెల 23(ఆదివారం) రాత్రి అన్నదమ్ములు మద్యం తాగి ఇంటికి వెళ్లారు. అన్నం తిని ఒకే గదిలో వేర్వేరు మంచాలపై నిద్రించారు. భయంతో కొద్ది రోజులుగా వాటర్‌ ప్లాంట్‌లోనే పడుకుంటున్న నరేశ్‌ తన అన్నతో కలిసి ఇంటికి వెళ్లడంతో ఘోరం జరిగింది.

ఆదినుంచీ నేర స్వభావం..
సాదం రామకృష్ణది మొదటి నుంచి నేర స్వభావమని గ్రామస్థులు తెలిపారు. నరేశ్‌ భార్యను సైతం హింసించేవాడని దీంతో ఆమె రెండేళ్ల క్రితం వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు. తన మొదటి భార్యను సైతం వేధించటంతో ఆమె వెళ్లిపోగా రామకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడని వివరించారు. ఖమ్మం సమీపంలోని కోయచిలక వద్ద ఓ ఆలయంలో విగ్రహాల చోరీ కేసులో రామకృష్ణ ప్రధాన నిందితుడు. పలు ఘర్షణలు, వివాదాలకు సంబంధించి అతనిపై పలు కేసులున్నాయి.


నిందితుడు రామకృష్ణను (బ్లూ నెక్‌ టీషర్టు) అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఇంట్లో దాచిన గొడ్డలితో..
ముందస్తు ప్రణాళికతో ఉన్న రామకృష్ణ సోమవారం తెల్లవారుజామున నిద్రలేచాడు. ఇంట్లో దాచిన గొడ్డలిని చేత పట్టుకుని నిద్రిస్తున్న తమ్ముడిని ‘తమ్ముడూ లేరా.. లేరా’ అంటూ పిలిచాడు. గాఢ నిద్రలో ఉన్న నరేశ్‌ అటూఇటూ కదులుతుండగా గొడ్డలితో తల, మెడ, నుదురుపై ఎనిమిది సార్లు విచక్షణారహితంగా నరికేశాడు. మృతిచెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత తన సెల్‌లో ఫొటోలు తీసి బంధువులకు పంపి రాక్షసానందం పొందాడు. ఊరు బయట అందరి మధ్యలో.. తమ్ముణ్ని తానే చంపానని, నిద్రపోతున్న వాడిని చంపొద్దనే భావనతో వాడిని నిద్ర లేపుతూనే హతమార్చానని స్పష్టం చేశాడు. విషయాన్ని తన పెద్ద అన్న సాదం రామారావు(గ్రామ సర్పంచి)తోపాటు ఇతర జనాలకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రహమాన్‌, సీఐ సురేశ్‌, ఎస్సై వీరప్రసాద్‌ ఘటనా స్థలికి చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరం అంగీకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సర్పంచి సాదం రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు