వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు బుధవారం అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది.

Updated : 01 Jun 2023 05:23 IST

అందులో ఒకరు ఆ శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత  
నేడు శాఖాపరమైన అంశాలపై  సంఘాలతో ఉన్నతాధికారుల భేటీ
ఈలోగానే అనూహ్య పరిణామాలు
ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తున్నందునే ప్రభుత్వ కక్షసాధింపన్న నేతలు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ (విద్యాధరపురం): ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు బుధవారం అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వానికి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘానికి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అరెస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖలో నాలుగు జోన్లను మూడింటికి కుదించడం, శాఖాపరమైన మార్పుచేర్పులను ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన రీ ఆర్గనైజేషన్‌ (పునర్‌ వ్యవస్థీకరణ-2) అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కమిషనర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టులు చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తాము ఉద్యమం చేస్తుండటంతో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్టులని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. అరెస్టు చేసిన వారి ఆచూకీ తెలియడం లేదని.. కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడలో ఒకరు, విజయవాడలో ముగ్గురు

వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంధ్యను గుడివాడలో పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్య సమస్యలతో సెలవులో ఉన్న మెహర్‌కుమార్‌ను ఇంటి వద్ద, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ చలపతి, విజయవాడ-1 డివిజన్‌ కార్యాలయంలో అటెండర్‌ సత్యనారాయణను కార్యాలయాల్లో అరెస్టు చేశారు. ఈ పరిణామాలు సహచర ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అరెస్టయినవారిలో మెహర్‌కుమార్‌ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాగా మిగిలిన వారు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘంలో సభ్యులు. వీరిని విజయవాడలోనే అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది.

తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారు..

‘నిందితులు స్వలాభం కోసం వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి, తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారు. పంపిణీ రిజిస్టర్లలోనూ తప్పుడు లెక్కలు నమోదు చేసి, ఏపీ జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారు. డీలర్లు, ఏజెన్సీలు, వ్యక్తుల ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ.. పన్నును తగ్గించి, వసూలు చేశారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. డీలర్లు, ఏజెన్సీల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సంబంధిత రికార్డులను మాయం చేశారు. ఈఎస్‌ఐ, నీరు- చెట్టు, తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కోసం తనిఖీ నిమిత్తం ఆడిటర్లను పిలిచి, ఆ ఫైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డిమాండ్‌ చేశారు. పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని, జరిమానా విధించకుండా వదిలేశారు. దీంతోపాటు డీలర్లు సమర్పించిన డేటాకు, పంపిణీ రిజిస్టర్లలోని వివరాలకు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించాం’ అని కమిషనర్‌ కాంతిరాణా టాటా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారంలో గతంలోనే వీరు సస్పెండయ్యారు. అప్పటి నుంచి అంతర్గతంగా విచారణ సాగుతోంది. ఇటీవల ఒక్కొక్కరు విధులకు హాజరవుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలోని విజయవాడ-1 డివిజన్‌కు జాయింట్‌ కమిషనరుగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ ఐఏఎస్‌ అధికారిని గత నెలలో నియమించింది. ఈ డివిజన్‌ కేంద్రంగా కొద్దికాలం నుంచి ఉద్యోగ సంఘాలు, వాణిజ్య పన్నుల శాఖలోని పలువురు ఉన్నతాధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేస్తున్నారంటూ పలువురుని ప్రభుత్వం బదిలీ చేయడంతో ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ‘స్టే’ పొందారు.


హక్కుల కోసం పోరాడుతున్నందుకే అరెస్టులు

ఒకటో తేదీన జీతాలివ్వాలని గవర్నర్‌ను కలిసినందుకే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఉద్యోగులను వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ఆరోపించారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నలుగురిని కారణం కూడా చెప్పకుండానే పోలీసులు తీసుకెళ్లిపోయారన్నారు. విజయవాడలో సూర్యనారాయణ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఉద్యోగుల హక్కుల కోసం మేం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకే.. ఏపీజీఈఏకి చెందిన సంధ్యారాణి, మెహర్‌కుమార్‌, చలపతి, సత్యనారాయణలను వారి కార్యాలయాల్లో అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఒక పత్రికలో వార్త వస్తే.. దానిని పట్టుకుని నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా.. సస్పెన్షన్‌ను కొట్టేసింది. ప్రస్తుతం వారంతా విధి నిర్వహణలో ఉండగా అరెస్టు చేశారు. కనీసం ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళుతున్నారో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడమేంటి? హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తాం’ అని అన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు, సంఘం నాయకులు, బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని