Train Accident: పట్టాలపై మరణమృదంగం.. ఒడిశాలో మూడు రైళ్ల ఢీ
ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 238 మందికి పైగా దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
238 మంది దుర్మరణం
900 మందికి పైగా గాయాలు
తొలుత పట్టాలు తప్పిన బెంగళూరు-హావ్‌డా బోగీలు
అదే సమయంలో వాటిని ఢీకొన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్
పక్క ట్రాక్‌పై పడిన కోరమండల్ బోగీలను ఢీకొన్న గూడ్స్
ఫలితంగా భారీగా పెరిగిన ప్రమాద తీవ్రత
ఇంకా బోగీల్లోనే మరో 600-700 మంది!
రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
బాలేశ్వర్, హావ్‌డా, న్యూస్‌టుడే-భువనేశ్వర్ అర్బన్: ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 238 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అమితాబ్ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు.
క్షతగాత్రుల హాహాకారాలు
ప్రమాదం అనంతరం బోగీల్లో చిక్కుకున్నవారి హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. సత్వరం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భువనేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలువురు వాటి లోపల చిక్కుకొని ఉన్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్థానికులు కూడా తమకు సహకరిస్తున్నారని, అయితే చీకటి కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని వివరించారు. ఇప్పటివరకు నాలుగు యూనిట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్, మూడు యూనిట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను మోహరించారు. 115 అంబులెన్సులను రంగంలోకి దించారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
తాజా దుర్ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్, కోల్‌కతాల నుంచి సహాయక బృందాలను ఘటనాస్థలానికి ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, వాయుసేన బృందాలనూ తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనాస్థలంలో తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. శనివారం తాను అక్కడికి వెళ్లనున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధాని కూడా పరిహారం ప్రకటించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ..
రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు పలు హైల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటుచేశారు.
ఒడిశా ప్రభుత్వం ఏర్పాటుచేసిన నంబరు- 06782-262286.
రైల్వే హెల్ప్‌లైన్లు: హావ్‌డా 033-26382217; ఖరగ్‌పుర్ 8972073925
బాలేశ్వర్ 8249591559; చెన్నై 044-25330952
వాల్తేరు డివిజన్ పరిధిలో..
విశాఖపట్నం(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: వాల్తేరు డివిజన్ కూడా హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖకు 08912 746330, 08912 744619, విజయనగరానికి 08922-221202, 08922-221206.
ద.మ.రైల్వే పరిధిలో..
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్ (7815915571) సహాయ కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. నెల్లూరు రైల్వే స్టేషన్ (08612342028)లోనూ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడి వాతావరణం భీతావహం
‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
ఈనాడు, అమరావతి: పెద్ద శబ్దం. భారీగా కుదుపులు. చుట్టూ చీకటి. ఏం జరిగిందో తెలియని స్థితి. ఏదో పెద్దప్రమాదమే జరిగిందని భావించాం. దిగి చూస్తే ధ్వంసమైన బోగీలు. ఎటు చూసినా ఆర్తనాదాలు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. అక్కడ అంతా భయానక వాతావరణం నెలకొంది. ఇవీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ... ఏపీలోని విజయవాడ, ఏలూరు తదితర స్టేషన్లలో దిగాల్సిన పలువురు ప్రయాణికులు.. ప్రమాద స్థలం నుంచి ‘ఈనాడు’తో వెల్లడించిన అభిప్రాయాలు.
చెల్లాచెదురుగా మృతదేహాలు
- సుశాంత్, రాజమహేంద్రవరం
బాలేశ్వర్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్నాం. ఎస్-3 స్లీపర్ బోగీలో ఉన్నాం. ఇదీ ఘోరమైన ప్రమాదం. మా బోగీ నుంచి బయటకు వచ్చి చూస్తే ముందున్న స్లీపర్, జనరల్ బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా బయట పడివున్నాయి. అక్కడి వాతావరణం చూస్తే భీతావహంగా ఉంది.
30 సెకండ్ల పాటు కుదుపులు
- శ్రీకర్‌బాబు, ఏలూరు
షాలిమార్ నుంచి ఏలూరు వస్తున్నాం. మేం బీ8 కోచ్‌లో ఉన్నాం. 30 సెకండ్ల పాటు బోగీలు కుదుపులకు లోనయ్యాయి. మేమంతా తీవ్ర ఆందోళన చెందాం. కిందికి దిగి చూస్తే మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో అంబులెన్సులు వచ్చాయి. మేం ప్రమాద స్థలం నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ నుంచి బస్సులో భువనేశ్వర్ వెళ్లాం.
ఏం జరుగుతుందోనని ఆందోళన
- గోపీకృష్ణ, విజయవాడ
షాలిమార్ నుంచి విజయవాడ వస్తున్నాం. పెద్ద శబ్దంతో ప్రమాదం జరిగింది. మా కోచ్ పడిపోతుందని భావించాం. కొంత ఒరిగి ఆగింది. వెంటనే మేం దిగిపోయాం. ఆందోళనతో ఒకరిని ఒకరు పట్టుకొని కేకలు వేశాం. మా కోచ్‌కు ఎక్కువ ప్రమాదం లేదు. మేం బి-9 కోచ్‌లో ఉన్నాం. మా కోచ్‌లోని టీసీకి గాయాలయ్యాయి. బోగీ నుంచి మేం బయటకు దిగినప్పుడు రైల్వే లైన్ విద్యుత్ తీగలు మాకు తగిలేలా వేలాడుతున్నాయి. అదృష్టం కొద్దీ వాటిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం.
జనరల్ బోగీ, స్లీపర్ కోచ్‌లు ధ్వంసం
- యు.రామారావు, విజయవాడ
మేం షాలిమార్ నుంచి విజయవాడకు వస్తున్నాం. థర్డ్ ఏసీ బోగీలో ఉన్నాం. బోగీలన్నీ పట్టాలు తప్పాయి. జనరల్ బోగీలు, స్లీపర్ కోచ్‌లు ఎక్కువగా ధ్వంసం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ