Rajanna Sircilla: ప్రేమ దూరమై.. వేధింపులు భారమై!

మతాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న మహిళ జీవితం విషాదాంతమైంది.

Updated : 01 Jul 2023 07:43 IST

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం

బోయినపల్లి, న్యూస్‌టుడే: మతాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న మహిళ జీవితం విషాదాంతమైంది. పెళ్లయ్యాక భర్త నుంచి ప్రేమ దూరమై.. వేధింపులు పెరగడం భరించలేక పదేళ్లు కూడా నిండని ముగ్గురు పిల్లలను జలసమాధి చేసి, తానూ తనువు చాలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ విషాదం గ్రామస్థులను కన్నీరు పెట్టించింది. మృతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన రజిత అలియాస్‌ నేష (30) కంప్యూటర్‌ నేర్చుకునేందుకు కరీంనగర్‌ వెళ్లేది. అక్కడ సుభాష్‌నగర్‌కు చెందిన అరటిపండ్లు విక్రయించే మహ్మద్‌ అలీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి వివాహానికి రెండు కుటుంబాలు ఆంగీకరించలేదు. దాంతో పదేళ్ల క్రితమే రజిత ఇంట్లోనుంచి వెళ్లి అలీని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు మహ్మద్‌ అయాన్ష్‌ (7), ఉస్మాన్‌ మహ్మద్‌ (14 నెలలు), ఒక కుమార్తె అశ్రజబిన్‌ (5) ఉన్నారు.  వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అలీ రజితను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. దాంతో ఆమె వేములవాడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తన ప్రవర్తన మార్చుకుంటానని మాట ఇచ్చి అలీ అప్పుడు లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నాడు.

తర్వాత రజిత కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఈ నెల 27న భార్య, ముగ్గురు పిల్లలను రుద్రవరంలోని తల్లిగారి ఇంట్లో దింపాడు. తల్లిదండ్రులు రాజనర్సు, లక్ష్మిలు రజితకు సర్దిచెప్పి భర్త దగ్గరకు వెళ్లాలని మరుసటిరోజు బస్‌స్టాప్‌ వద్ద దింపారు. తర్వాత వారు తమ కుమార్తె రజితను భర్త వేధిస్తున్నాడని వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. బక్రీద్‌ తర్వాత పిలిపిస్తామని పోలీసులు చెప్పడంతో వారు రుద్రవరం వచ్చారు. కాగా శుక్రవారం కొదురుపాక నాలుగు వరుసల రహదారి పక్కన మధ్యమానేరు జలాశయంలో వివాహిత, ముగ్గురు పిల్లల మృతదేహాలు కనబడటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వేములవాడ పట్టణ పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒడ్డున ఉన్న సంచిలో లభించిన చిరునామా, ఫోన్‌నంబరు ఆధారంగా రజిత భర్త అలీ, రుద్రవరంలోని ఆమె సోదరుడికి సమాచారమిచ్చారు. స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీయించి శవ పరీక్ష కోసం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. రజిత తమ్ముడు రంజిత్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్‌ వెల్లడించారు. కట్నం కోసం వేధించడంతోనే రజిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని