సంక్షిప్త వార్తలు (5)

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మహిళను అర్ధనగ్నంగా మార్చి దాడి చేసిన ఘటన రాజస్థాన్‌ బాడ్‌మేడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 15 Apr 2024 06:08 IST

రాజస్థాన్‌లో మహిళపై అకృత్యం
అర్ధనగ్నంగా మార్చి దాడి

జైపుర్‌: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మహిళను అర్ధనగ్నంగా మార్చి దాడి చేసిన ఘటన రాజస్థాన్‌ బాడ్‌మేడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో అర్ధనగ్నంగా ఉన్న బాధితురాలిని ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


పంజాబ్‌లో వీహెచ్‌పీ నేత కాల్చివేత

రూప్‌నగర్‌: పంజాబ్‌లోని రూప్‌నగర్‌ జిల్లా నంగల్‌లో విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం కలకలం రేపింది. నంగల్‌ వీహెచ్‌పీ అధ్యక్షుడు వికాస్‌ బగ్గా శనివారం సాయంత్రం తన దుకాణంలో ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలతో ఆయన మరణించారు. దీన్ని నిరసిస్తూ వీహెచ్‌పీ, భాజపా కార్యకర్తలు ఆదివారం రహదారులపై ఆందోళన చేపట్టారు.


ట్రక్కును ఢీకొన్న కారు.. 
మంటల్లో ఏడుగురి సజీవదహనం
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు

జైపుర్‌: రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌. ఆదివారం మధ్యాహ్నం వారు సాలాసర్‌ బాలాజీ ఆలయం నుంచి కారులో హిసార్‌కు వెళ్తుండగా, వారి వాహనం ట్రక్కును వెనుక నుంచి ఢీకొంది. ఈ క్రమంలో కారులోని ఎల్‌పీజీ కిట్‌ పేలడంతో మంటలు చెలరేగి వాహనంలో ఉన్నవారంతా సజీవ దహనమయ్యారు.


బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతం

రీవా: మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా మనికా గ్రామంలో రెండ్రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. చిన్నారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సహాయక బృందాలు 40 గంటలపాటు శ్రమించినప్పటికీ చిన్నారిని రక్షించలేకపోయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. 70 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కుపోయినట్లు సహాయక బృందాలు గుర్తించాయి. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను పంపాయి. బోరుబావికి ఇరువైపులా గుంతలు తవ్వి బాలుణ్ని కాపాడే యత్నం చేశాయి. అయినప్పటికీ బాలుడు ప్రాణాలతో లేకపోవంతో విషాదం అలముకుంది.


గుడిసెలో అగ్నిప్రమాదం..

ముగ్గురు చిన్నారుల సజీవ దహనం

అంబికాపుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో చిన్నారులైన ముగ్గురు తోబుట్టువులు సజీవ దహనమయ్యారు. కమలేశ్వర్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బరిమా గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఎనిమిది, నాలుగేళ్లు బాలికలు, రెండేళ్ల బాలుడు ఉన్నారు.  రాత్రి 9 గంటల సమయంలో వారి తల్లి ఇంట్లో స్టవ్‌ని వెలిగించి, తన పెద్ద కుమార్తె కోసం బయటకి వెళ్లింది. తిరిగి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె తిరిగి రాగా ఇల్లంతా అప్పటికే దగ్ధమైంది. స్టవ్‌ మంటలు వ్యాపించటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని