Crime News:అడ్డు తొలగించుకోవాలని హత్యచేశారు..అడ్డంగా దొరికిపోయారు!

వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్త ఉసురు తీసిందో భార్య. ఆదివారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన ఘటన ఇది. హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటయ్య(30) ఇదే మండలం బుద్దారం గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చారు.

Updated : 11 Jan 2022 06:45 IST

న్యూస్‌టుడే, హన్వాడ: వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్త ఉసురు తీసిందో భార్య. ఆదివారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన ఘటన ఇది. హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటయ్య(30) ఇదే మండలం బుద్దారం గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చారు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన మాధవికి నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేశ్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి,  వివాహేతర సంబంధానికి దారితీసింది. తిరిగి బుద్దారం వచ్చిన తర్వాత రమేశ్‌ తరచూ ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న వెంకటయ్యను చంపేయాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఆదివారం వెంకటయ్య ఇంట్లో పడుకున్న విషయాన్ని మాధవి, రమేశ్‌కు చేరవేసింది. అతడు తన మిత్రుడు కుర్మయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై రాత్రి 11 గంటల ప్రాంతంలో బుద్దారానికి వచ్చాడు. వెంకటయ్యను అందరూ కలిసి చున్నీ గొంతుకు బిగించి చంపేశారు. మద్యం తాగి రోడ్డుపై పడి చనిపోయాడని చిత్రీకరించాలని పథకం పన్నారు. రమేశ్‌, కుర్మయ్యలు ద్విచక్రవాహనంపై తమ మధ్య వెంకటయ్య మృతదేహాన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరారు. ఇదే సమయంలో మహ్మదాబాద్‌  ఎస్సై రవిప్రకాశ్‌, సిబ్బంది జిల్లా కేంద్రం నుంచి వాహనంలో వెళుతున్నారు. ఎస్సైకి అనుమానం వచ్చి వారిని ఆపి ప్రశ్నించగా.. వెంకటయ్య తాగి ఉండడంతో ఇంటికి తీసుకెళుతున్నామని బుకాయించారు. ఎస్సై గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. నిందితులను హన్వాడ పోలీసులకు అప్పగించారు. వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. హత్య చేసినప్పుడు వారు ఇంట్లోనే పడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని