Crime News: మాట్లాడుకుందామంటూ భార్యను హోటల్‌కు తీసుకెళ్లి..

వేధింపులకు విసిగిపోయిన భార్య... తన భర్తపై కేసు పెట్టింది. కొద్ది రోజులుగా అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో కేసు విషయంపై మాట్లాడుకుందామని, నమ్మకంగా భార్యని పిలిచాడు. ఓ హోటల్‌లోకి తీసుకెళ్లి, గొంతు కోసి ప్రాణం

Updated : 15 Mar 2022 08:16 IST

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : వేధింపులకు విసిగిపోయిన భార్య... తన భర్తపై కేసు పెట్టింది. కొద్ది రోజులుగా అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో కేసు విషయంపై మాట్లాడుకుందామని, నమ్మకంగా భార్యని పిలిచాడు. ఓ హోటల్‌లోకి తీసుకెళ్లి, గొంతు కోసి ప్రాణం తీసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులను ఉరుకులు పెట్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... కంచికచర్లకు చెందిన ఉప్పిల్లి ప్రసాదరావు(32) దుబాయ్‌లో పని చేస్తుంటారు. షరూన్‌ పరిమళ (23) అనే యువతితో ఇతడికి అయిదేళ్ల క్రితం వివాహమైంది. భార్య నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోంది. విబేధాల కారణంగా వీరిద్దరూ కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. భర్త వేధింపులపై గత ఏడాది అక్టోబరు నెలలో కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో భార్య కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కేసు విషయమై మాట్లాడుకుందామని భార్యను నమ్మకంగా విజయవాడకు పిలిచాడు ప్రసాదరావు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పాత బస్టాండ్‌ సమీపంలోని ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో భార్యకు జ్యూస్‌ తెస్తానని రిసెప్షనిస్టు సుధాకర్‌రెడ్డికి చెప్పి, ప్రసాదరావు బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత జ్యూస్‌తో వచ్చాడు. జ్యూస్‌ నచ్చలేదు, మరొకటి తెచ్చేందుకు వెళుతున్నానని చెప్పి 2.30 గంటల సమయంలో మళ్లీ బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవటంతో లాడ్జి రిసెప్షనిస్ట్‌.. అతడికి ఫోన్‌ చేయగా, వస్తానంటూ ఫోన్‌లో ప్రసాదరావు సమాధానం ఇచ్చాడు.

హత్య చేసి, బయటికి వెళ్లిపోయాడు..

తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసాదరావు కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను హత్య చేశానని చెప్పి, పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు గవర్నర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోగా హోటల్‌ రిసెప్షనిస్ట్‌ సుధాకర్‌రెడ్డి.. జరిగిన సంఘటనను గవర్నర్‌పేట పోలీసులకు తెలియజేయటంతో వారు హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. గదిలోకి వెళ్లి పరిశీలించగా పరిమళ మంచంపై పడుకుని ఉంది. ముఖంపై దుప్పటి కప్పి ఉంది. దుప్పటి తీసి చూడగా, ఆమె గొంతుపై లోతైన గాయంతో విగతజీవిగా కనిపించింది. రిసెప్షనిస్ట్‌ సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కొత్తాసుపత్రి మార్చురీకి తరలించారు. పరిమళ హత్య వార్త విని పెద్ద ఎత్తున బంధువులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే పరిమళ హత్యకు గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబరు నెలలో ఇచ్చిన వేధింపుల కేసుపై కఠినచర్యలు తీసుకుని ఉంటే, ఈ దారుణం జరిగేది కాదని కన్నీటి పర్యంతమయ్యారు.  పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.


బంధువుల ఆందోళన

కంచికచర్ల, న్యూస్‌టుడే : పరిమళను హత్య చేసిన నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి బంధువులు సోమవారం సాయంత్రం కంచికచర్ల పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. అతడిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరగకపోతే సామూహికంగా స్టేషన్‌ వద్దే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించేవరకూ కదలబోమని బైఠాయించడంతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ట్రాపిక్‌ నిలిచిపోయింది. హత్య జరిగింది ఇక్కడ కాదని, రహదారిపై బైఠాయించడం మంచి పద్ధతి కాదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని నందిగామ గ్రామీణ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌ వారిని కోరారు. పరిమళ గతేడాది పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి పోలీసులు వారిని చెదరగొట్టారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని